Site icon MANATELANGANAA

మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు.. శాశ్వత మౌలిక వసతులపై మంత్రి సీతక్క

మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు.. శాశ్వత మౌలిక వసతులపై మంత్రి సీతక్క

ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మినీ మేడారం జాతర.. రాబోయే రెండు నెలలపాటు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

ములుగు: మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. జాతర నిర్వహణకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లతో పాటు భవిష్యత్ జాతరలకు, ఏడాది పొడవునా మేడారాన్ని సందర్శించే భక్తులకు ఉపయోగపడేలా శాశ్వత మౌలిక వసతులను కల్పించాలని సూచించారు.

శనివారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్‌లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మినీ మేడారం జాతర నిర్వహణ, అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 2027 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించనున్న మినీ మేడారం జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గత మహాజాతర సమయంలో తక్కువ వ్యవధిలోనే విస్తృత ఏర్పాట్లు చేపట్టి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాతరను విజయవంతంగా నిర్వహించుకున్నామని గుర్తుచేశారు.

గత జాతర సందర్భంగా వివిధ శాఖలకు మంజూరైన అభివృద్ధి పనుల్లో పూర్తయినవి, పురోగతిలో ఉన్నవి, ఇంకా చేపట్టాల్సిన పనులను సమీక్షించాలని అధికారులకు సూచించారు. మంజూరు ఉత్తర్వులను పరిశీలించి, ప్రధాన పూజారులు, ఇతర పూజారులతో చర్చించి అదనంగా అవసరమైన పనులను గుర్తించాలన్నారు. కొత్తగా ప్రతిపాదించే పనులు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా రూపొందించాలని స్పష్టం చేశారు.

రాబోయే రెండు నెలలపాటు మినీ జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, మేడారంతో పాటు అనుబంధ జాతరలు జరిగే ప్రాంతాల్లోనూ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, దేవాదాయ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్య శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరాలను గుర్తించాలన్నారు. స్థానిక పూజారులు, ప్రజల అభిప్రాయాలను సేకరించి శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

తాగునీరు, విద్యుత్ దీపాలు, రహదారులు, పారిశుధ్యం, ఆలయ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాత్కాలిక ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే శాశ్వత నిర్మాణాల ప్రతిపాదనలు వేర్వేరుగా రూపొందించాలని సూచించారు.

కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో నిర్వహించే జాతర ఏర్పాట్లపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరకు భక్తులు మూడు రోజులపాటు బస చేసే అవకాశాలున్నందున తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. జాతర ప్రాంగణంలో శాశ్వత విద్యుత్ దీపాల ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు అటవీ శాఖతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు.

మినీ జాతరగా భావించి భక్తుల రద్దీని తక్కువగా అంచనా వేయవద్దని మంత్రి స్పష్టం చేశారు. గత మహాజాతర అనంతరం కూడా వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని, మినీ జాతరకు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలన్నారు.

మేడారం సమగ్రాభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. జాతర సమయంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రహదారుల విస్తరణ, రింగ్ రోడ్డు తరహా మార్గాల అభివృద్ధి, శాశ్వత బస్టాండ్ నిర్మాణం, ప్రత్యామ్నాయ రవాణా మార్గాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. రహదారుల విస్తరణకు అవసరమైన అటవీ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ పంపినట్లు తెలిపారు.

మంజూరైన వంతెనల నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, ఏటా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం లేకుండా శాశ్వత వంతెనలు నిర్మించాలని సూచించారు. రాబోయే మహాజాతర నాటికి రవాణా సౌకర్యాలను మెరుగుపరచి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఏడాది పొడవునా మేడారానికి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణానికి వెలుపల అనువైన ప్రదేశాల్లో శాశ్వత సులభ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పూజారులు, స్థానిక సర్పంచ్, దేవాదాయ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు సమన్వయంతో అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా మేడారంతో పాటు మల్లూరు దేవాలయానికి భక్తుల రాక పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు, అవసరాలు, అభివృద్ధి ప్రతిపాదనలను త్వరితగతిన సమర్పించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ మినీ మేడారం జాతర ఏర్పాట్లపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. పూజారులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనాలను త్వరితగతిన రూపొందించి సమర్పించాలని, వచ్చే వారం నుంచి శాఖల వారీగా పనుల పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తామని తెలిపారు.

సమీక్ష సమావేశానికి ముందు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, ఎం. సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, స్థానిక సర్పంచ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version