Site icon MANATELANGANAA

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ములుగు జిల్లా | ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలం
ప్రఖ్యాత మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరకు లక్షలాది భక్తులు హాజరుకానున్నారు.

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను ప్రపంచానికి పరిచయం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది.

సమాచార పౌర సంభందాల శాఖ మీడియాకు సంధాన కర్తగా పనిచేస్తుంది.
మహాజాతర సందర్భంగా భక్తులు, జాతర నిర్వహణ, భద్రత, దర్శన ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం సకాలంలో ప్రజలకు చేరేలా మేడారంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను పంచాయతీ రాజ్‌, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు.

గద్దల ప్రాంగణానికి సమీపంలో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఈ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరాలు అందిస్తూ, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా ప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.

రాష్ట్ర, జాతీయ స్థాయి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో జాతర కవరేజ్‌కు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, మీడియా సెంటర్ నుంచే సమన్వయంతో వేగవంతమైన సమాచారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.


మంత్రి సీతక్క మాట్లాడుతూ, అత్యంత తక్కువ సమయంలో జాతర ఏర్పాట్లు పూర్తవడం అమ్మవారి దయ వల్లేనని పేర్కొన్నారు. మహాజాతర ప్రారంభానికి ముందే భారీ సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటున్నారని తెలిపారు. జాతర నిర్వహణ కోసం అధికారులు రాత్రింబగళ్లు శ్రమించారని ఆమె ప్రశంసించారు. ఎక్కడైనా చిన్నపాటి లోపాలు కనిపిస్తే భక్తులు సహకరించాలని ఆమె కోరారు.
అమ్మవారి దర్శనంతో ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని మంత్రి ప్రార్థించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు, కె. వెంకట సురేష్, ఏడి లక్ష్మణ్ కుమార్, వసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కాళ్యాణి, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు

Share this post
Exit mobile version