Site icon MANATELANGANAA

న్యాయవాదులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది

న్యాయవాదులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది

న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

 న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకు అండగా తెలంగాణ నిలుస్తుందని, న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ముందుంటానని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ఆద్వర్యంలో రాష్ట్ర రాజధాని ఖైరతాబాద్ లోని ఇంజనీర్స్ ఇండియా భవనంలో ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షురాలు సుజాత చౌదంటే అధ్యక్షతన జరిగిన మహిళా న్యాయవాదుల రాష్ట్ర సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 
అవనిలో సగమైన మహిళలు అవకాశాల్లో సగం సాధించలేకపోతున్నారని, 70 ఏండ్ల స్వాతంత్ర భారత దేశంలో మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉందని ఫాతిమా ను జడ్జిగా నియమించిన సందర్భంలో కూడా విమర్శలు చేశారని అన్నారు. ఉన్నత విద్యార్హత, ఉత్తీర్ణతలు ఎన్ని ఉన్నా కులం, మతం, జెండర్ పేరుతో అవకాశాలకు దూరమవుతున్నారని అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ న్యాయవ్యవస్థలో మహిళలు  రాణిస్తున్నప్పటికీ చట్టపరమైన అవకాశాలు లేకపోవడంతో పాటు పురుషాధిక్య సమాజంలో న్యాయవాదులు, న్యాయమూర్తుల అభివృద్ధి జరగడం లేదని అన్నారు. ప్రజా ఉద్యమాలతో జీవితం ప్రారంభించి న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించిన నేను నేడు చట్టసభల్లోకి ప్రవేశించి ఒక గౌరవప్రదమైన మంత్రి పదవి లో కొనసాగుతున్నానని అన్నారు. కొంతమంది రాజ్యాంగ వ్యతిరేకశక్తులు న్యాయ వ్యవస్థను తగ్గించి మాట్లాడుతున్నారని, ఆ విధానం మంచిది కాదని రాజ్యాంగం వల్లనే నాలాంటి వాళ్ళు ఈ స్థాయికి ఎదిగారని అన్నారు. రాజ్యాంగం నాకేమిచ్చిందని అనే వారికి నా జీవితమే సమాధానమని అన్నారు. న్యాయ వ్యవస్థ తెలియని సమాజానికి న్యాయం అందేలాగా, రాజ్యాంగ ఫలాలు సామాన్యులకు అందేలాగా చూడాలనీ అన్నారు. న్యాయవాద రక్షణ చట్టం తదితర అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ తిరుమలదేవి మాట్లాడుతూ మహిళా న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో రాణించాలంటే కుటుంబంతో పాటు సమాజం సహకారం అందించాలని, వచ్చిన అవకాశాలను కూడా ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. అన్ని శక్తులకన్నా స్త్రీ శక్తి గొప్పదని ఆ స్త్రీ సాధికారత కోసం ఇంకా మాట్లాడుకోవడం బాధాకరమని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినియోగదారుల రాష్ట్ర కమీషన్ చైర్ పర్సన్ జస్టిస్ జి రాధారాణి మాట్లాడుతూ మహిళా సమాజం న్యాయవాద విద్యలో ప్రావీణ్యం సాధిస్తూ, వృత్తిలో మెలుకువలు అభివృద్ధి చేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారత న్యాయ వ్యవస్థలో పితృస్వామ్య సమాజ ఆధిపత్యం కొనసాగుతుండటంతో చాలా అవకాశాలు కోల్పోతున్నారని ఐక్యతతో అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ  న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, న్యాయవాదుల రక్షణ కోసం 1990 లోనే అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కన్వెన్షన్ లో భారతదేశం కూడా పాల్గొన్నదని 35 ఏండ్ల తర్వాత కూడా భారత్ లో న్యాయవధ రక్షణ చట్టం తీసుకురాకోవడం దుర్మార్గమని అన్నారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణతో పాటు దేశంలో న్యాయవాద రక్షణ చట్టం కోసం ఐ ఎల్ పి ఎ దేశ వ్యాప్త ఉద్యమం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ రిటైర్డ్ అధికారి పి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఉన్నత న్యాయ స్థానాల్లో మహిళలతో పాటు బహుజన న్యాయవాదులకు, న్యాయమూర్తులకు తీరని అన్యాయం జరుగుతుందని, ఈ వివక్షను ఎదుర్కోవడానికి మహిళా న్యాయవాదులు, బహుజన న్యాయవాదులు ఐక్యతతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షురాలు సుజాత చౌదంటే మాట్లాడుతూ తెలంగాణ మహిళా న్యాయవాదుల చైతన్యం గొప్పగా ఉందని, తరతరాల  మహిళా వివక్షకు కారణమైన మనుధర్మ శాస్త్రం స్థానంలో అంబేద్కర్ అద్భుతమైన  భారత రాజ్యాంగం అందించినప్పటికీ దాన్ని అమలుపరిచే భారత పాలకుల వల్ల మహిళలు అణచివేతకు గురవుతున్నారని, ఆ క్రమంలోనే మహిళా న్యాయవాదుల హక్కులు హరించివేయబడుతున్నాయని అన్నారు.

తీర్మానాలు

సదస్సు అనంతరం ఐ ఎల్ పి ఎ రాష్ట్ర మహిళా కన్వీనర్ టి లక్ష్మీదేవి నాలుగు తీర్మానాలను చదివి న్యాయవాదుల నుండి ఆమోదం పొందారు. 1. రాష్ట్ర ప్రభుత్వ పరంగా నియమించబడే ప్రభుత్వ న్యాయవాది, సహాయక ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర పోస్టుల భర్తీ చేసే సమయంలో మహిళా జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు కల్పించాలి. 2. న్యాయవాద వృత్తిలో నమోదైన ప్రతి మహిళా న్యాయవాదికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి స్టైఫండ్ ఇవ్వాలి. 3. న్యాయవాద రక్షణ చట్టం తేవాలి. 4. న్యాయవాద శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి అందులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సదస్సు తీర్మానాలు చేసింది. 
 ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ జె శాంసన్, గౌరవ అధ్యక్షులు పొన్నం దేవరాజ్ గౌడ్,  ఉపాధ్యక్షులు టి లక్ష్మీదేవి, తీగల జీవన్ గౌడ్, పూస మల్లేష్, కృష్ణారెడ్డి, దయాల సుధాకర్, పొడిచేసి శ్రీనివాస్, తౌడబోయిన రేణుక, హుస్న ఖాన్, ఎం సుమలత, ఆంద్ర ప్రదేశ్ ఐ ఎల్ పి ఎ నాయకులు నూకతోటి రవి కుమార్, తెలంగాణ రాష్ట్ర ఐ ఎల్ పి ఎ నాయకులు చిల్ల రాజేంద్రప్రసాద్, గాంగేగేయుడు, డాక్టర్ తిప్పన్న డాంగే, కె సురేష్, భుజంగరావు, లతా ఆదోని, టి.హేమలత, కర్రె లచ్చన్న, జన్ను పద్మ, కెరీత్ కుమారి, గీతావనజాక్షి, మనీశ్వరి, జ్యోతి గరిగ,  సామ హేమలత, ఎస్తేరు, స్వర్ణలత, సమత, పరశురాజ్, వి తిరుపతి, గుగులోతు బద్రు, విజయ, విలాసాగరం సురేందర్ గౌడ్, ఎగ్గడి సుందర్ రామ్, అనిల్, ఎలమాద్రి రవి, పద్మ యాదవ్, శైలజ, అడ్లూరి పద్మ తదితరులు పాల్గొన్నారు
Share this post
Exit mobile version