రూ.2.68 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
వరంగల్, డిసెంబర్ 18, 2025:
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ స్పష్టం చేశారు. గురువారం వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధిలోని 38, 39 డివిజన్లలో రూ.2 కోట్ల 68 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 38వ డివిజన్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించామని తెలిపారు. అలాగే ఖిలా వరంగల్ ఈద్గా మరమ్మత్తుల కోసం కోటి రూపాయలు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈద్గా అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపామని, అక్కడ నీరు నిలిచే సమస్యను దృష్టిలో ఉంచుకొని మొత్తం ఫ్లోరింగ్ పనులు చేపట్టి సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
37వ డివిజన్ ఎంఎం నగర్‌లో లబ్ధిదారునికి మంజూరైన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరై గృహాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు సాధారణ గృహాల మాదిరిగానే బలంగా, చక్కగా నిర్మించబడుతున్నాయని, కొందరు లబ్ధిదారులు ఇల్లు మరింత విశాలంగా ఉండాలనే ఉద్దేశంతో స్వయంగా కొంత వ్యయం చేసి నిర్మించుకున్నారని ప్రశంసించారు. నిర్మాణంలో ఉన్న ఇతర ఇళ్లను కూడా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించామని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నారని మంత్రి తెలిపారు. అదే క్రమంలో వరంగల్ (తూర్పు) నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లలో ఇప్పటికే అనేకమంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించామని చెప్పారు. ఎల్–1లో ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేస్తామని, ఎల్–2లో ఉన్న స్థలంలేని నిరుపేదలకు ఇప్పటికే నిర్మితమైన డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తామని, కేటాయింపు అనంతరం అవసరమైన మరమ్మత్తులు చేపడతామని వివరించారు.
ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును మేయర్, కలెక్టర్, కమిషనర్‌లతో చర్చించి, సంబంధిత కార్పొరేటర్ల సహకారంతో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. కోట్లాది రూపాయల నిధులను వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేశామని, భవిష్యత్తులో కూడా నిధుల కేటాయింపు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామని చెప్పారు.
ఎయిర్‌పోర్టు సమస్య దాదాపు పరిష్కారమైందని, జనవరి మొదటి లేదా రెండో వారంలో ముఖ్యమంత్రి వరంగల్ నగరానికి వచ్చి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం నిర్మాణం పూర్తయిందని, నగరంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రిని ఆహ్వానించి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభింపజేస్తామని తెలిపారు.
అంతకుముందు మధ్యకోట యాదవవాడ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న వాసరం హరిత ఇంటిని మంత్రి పరిశీలించి నిర్మాణ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, కార్పొరేటర్లు బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ సురేష్, బస్వరాజు కుమారస్వామి, కావేటి కవిత, ఎస్‌ఈ సత్యనారాయణ, ఏసీపీ శుభమ్ తదితరులు పాల్గొన్నారు.

