విస్తుపోయే నిజాలు……
మొబైల్ ఫోన్ల పేలుళ్లే మంటలు విస్తరించడానికి కారణమని ఫోరెన్సిక్ నివేదిక
కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన భయానక బస్సు ప్రమాదంలో 19 మంది సజీవదహనమైన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు చేసిన విచారణలో అనేక సంచలన అంశాలు వెలుగు చూశాయి.
ప్రాథమిక వివరాల ప్రకారం, వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఆ బస్సు ఒక ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్ఢిన కారణంగా నిప్పుంటుకుని మంటలుచెలరిగాయని మొదట్లో నమ్మారు. కాని బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తిని పోలీసులు విచారించిన అనంతరం అసలు బైక్ ను బస్సు ఢీకొన లేదని నిర్దారణ కొచ్చారు. అప్పటికే బైకర్ శంకర్ కుడివైపు డివైడర్ ను ఢీ కొట్టి కిందపడిపోయాడు. వెనకాల ఉన్న అతను ఎగిరిపడిపోయి అక్కడి నుండిపారి పోయాడు. అదేసమయంలో బస్సు రోడ్డుపైన ఉన్న బైకును డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు ముందుభాగంలోబంపర్ కిందబైకర్ ఇరుక్కుపోయి ఈడ్చుకు వెళ్లింది. అదే సమయంలో బైక్ ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపోవడంతో పెట్రోల్ చిందిందని, బస్సు కింద భాగంలో బైక్ రోడ్డుకు రాక్కుంటూ వెళ్లడంతో నిప్పురవ్వలు చెలరేగాయని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పెట్రోల్ మంటలు వ్యాపించి బస్సును ఆవరించాయి.
తొలుత లగేజీ క్యాబిన్‌లో మంటలు అంటుకున్నాయని, ఆ భాగంలో సుమారు 400కి పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉన్నట్లు ఫోరెన్సిక్ టీమ్ తెలిపింది. వేడికి ఫోన్ బ్యాటరీలు ఒక్కొక్కటిగా పేలిపోవడంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఈ పేలుళ్ల వల్ల లగేజీ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌లో కూడా మంటలు చెలరేగి, బయటపడేందుకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు.
ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం, ఈ మొబైల్ ఫోన్ల పేలుళ్లే ప్రమాద తీవ్రతను పెంచి, బస్సు ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణమని తేలింది.
ప్రమాదంపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

