ఎస్.ఎస్. తాడ్వాయి మండలం.
ములుగు జిల్లా.
మేడారం జాతర సందర్భంగా అమ్మవార్ల పూజారులకు పట్టు వస్త్రాల పంపిణీ.
సమ్మక్క–సారలమ్మ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ.
మేడారంలో అభివృద్ధి పనుల క్షేత్రస్థాయి పరిశీలన.
మేడారం మహా జాతర సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మేడారం పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా ఐటీడీఏ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో అమ్మవార్ల పూజారులకు పట్టు వస్త్రాలను మంత్రి సీతక్క అందజేశారు.
అనంతరం ఎన్ఐటి మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు రచించిన “శ్రీ సమ్మక్క–సారలమ్మ జీవిత చరిత్ర” గ్రంథాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమ్మక్క–సారలమ్మ జీవిత చరిత్రపై పాండురంగారావు చేసిన చారిత్రక పరిశోధనను ప్రశంసించారు. ఇలాంటి మరిన్ని పరిశోధనలు జరగాలని, మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తీసుకురావాలన్న ఆకాంక్షను మంత్రి వ్యక్తం చేశారు.
అనంతరం మంత్రి సీతక్క అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని దర్శించుకున్నారు. గద్దెల వద్ద తెరగునీటి సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పక్కనే నిర్మాణంలో ఉన్న క్యూ లైన్ పనులను పరిశీలించి, వాటిని త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి మంత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను సందర్శించి, అక్కడ అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను పరిశీలించారు. జాతర విధుల్లో నిమగ్నమయ్యే సిబ్బందికి వసతి, భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ట్రైబల్ మ్యూజియాన్ని మంత్రి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి, జాతర సమయంలో మ్యూజియానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేడారం జాతర సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులన్నీ సమయానికి పూర్తి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. సుదీర్ రామ్ నాథ్ కేకన్, ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రా, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, ప్రొఫెసర్ పాండు రంగారావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

