Site icon MANATELANGANAA

కెపిహెచ్‌బిలో రికార్డు ధర పలికిన హౌసింగ్ బోర్డు ప్లాట్లు, ఫ్లాట్లు


బహిరంగ వేలం ద్వారా రూ.24.26 కోట్ల ఆదాయం

హైదరాబాద్, ఫిబ్రవరి 27:
కెపిహెచ్‌బి ప్రాంతంలో హౌసింగ్ బోర్డు భూములు, ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయిలో డిమాండ్ కనిపించింది.

వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా పేరుగాంచిన కెపిహెచ్‌బిలో నిర్వహించిన బహిరంగ వేలంలో ప్లాట్లు, ఫ్లాట్లు అధిక ధరలకు అమ్ముడయ్యాయి.

ఫేజ్-1, ఫేజ్-2లలోని ధర్మారెడ్డి కాలనీలో ఉన్న నాలుగు ఓపెన్ ప్లాట్లు, ఫేజ్-15లోని సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న ఎనిమిది ఫ్లాట్లకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. మొత్తం 40 మంది కొనుగోలుదారులు ఈ వేలంలో పాల్గొన్నారు.

ఎల్‌ఐజి కేటగిరీకి చెందిన ఒక ప్లాట్‌కు చదరపు గజానికి కనీస ధర రూ.1.30 లక్షలుగా నిర్ణయించగా, అది రూ.2.65 లక్షలకు అమ్ముడైంది. మరో ప్లాట్ చదరపు గజం రూ.2.41 లక్షలకు విక్రయమైంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోవడానికి పోటీ పడ్డారని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. వేలం ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లోని 1400 చదరపు అడుగుల ఫ్లాట్లకు రూ.90 లక్షలను అప్‌సెట్ ధరగా నిర్ణయించారు. అయితే బిడ్డర్లు పోటీగా పాల్గొనడంతో ఒక ఫ్లాట్ గరిష్టంగా రూ.1.10 కోట్లకు విక్రయమైంది. ఇతర ఫ్లాట్లు రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ.1.06 కోట్ల ధరలకు అమ్ముడయ్యాయి.

ఈ బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు మొత్తం రూ.24.26 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఓపెన్ ప్లాట్ల విక్రయం ద్వారా రూ.15.81 కోట్లు, సంపూర్ణం అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల ద్వారా రూ.8.45 కోట్లు సమకూరినట్లు తెలిపారు.

Share this post
Exit mobile version