Site icon MANATELANGANAA

మీడియా రంగంలో మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు ముందుకు సాగాలి

మీడియా రంగంలో మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు ముందుకు సాగాలి

హైదరాబాద్, మే 19:
డిజిటల్ యుగంలో మీడియా రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లిలోని అకాడమీ భవనంలో నిర్వహించిన జర్నలిస్టుల చర్చా కార్యక్రమంలో మీడియా భవిష్యత్, డిజిటలైజేషన్, మీడియా చట్టాలు, శిక్షణ కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమంపై విస్తృతంగా చర్చించారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కమిషనర్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ అధికారి జి. ముకుంద్ రెడ్డి పాల్గొన్నారు. జర్నలిజం చదివే రోజుల్లో పత్రికల ఎడిటోరియల్స్ చదవడం ద్వారా సివిల్ సర్వీసులపై ఆసక్తి పెరిగిందని, అదే తన విజయానికి పునాది అయిందని ఆయన తెలిపారు. జర్నలిస్టుల మధ్యకు రావడం ఆనందంగా ఉందన్నారు.

సీనియర్ జర్నలిస్టు ఐ. వెంకట్ రావు మాట్లాడుతూ మీడియా అకాడమీ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. అకాడమీకి మరిన్ని పుస్తకాలు అందజేస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ మాట్లాడుతూ జర్నలిజం తనకు ధైర్యం, గుర్తింపు ఇచ్చిందన్నారు.

ఉదుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక జర్నలిజానికి అనుగుణంగా డిజిటల్ క్లాసులు, ఇంక్యూబేటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్యాగ్ ఆర్డర్ వంటి అంశాలపై చర్చలు నిర్వహించాలని కోరారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ వెటరన్ జర్నలిస్టుల అనుభవాలను వీడియోలు, పుస్తకాల రూపంలో భద్రపరచాలని సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సభ్యులు మీడియా రంగంలో కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం పెరుగుతోందని పేర్కొన్నారు. జర్నలిస్టులు కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణా కార్యక్రమాలు, ఇంటర్న్‌షిప్‌లు, డెస్క్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.

అకాడమీ భవనంలోని డిజిటల్ సదుపాయాలు, ఆధునిక ఆడిటోరియం, బోర్డు రూమ్, లైబ్రరీ, కంప్యూటర్ రూమ్ వంటి వసతులను మరింత సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. పాత పత్రికలు, అరుదైన పుస్తకాలు, నిజాం కాలం నాటి ప్రచురణలు, తెలుగు గ్రంథాలను డిజిటలైజ్ చేసి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలని కోరారు.

మీడియా చట్టాల్లో కాలానుగుణ మార్పులు అవసరమని, సోషల్ మీడియాకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళి తీసుకురావాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. మహిళా జర్నలిస్టులు, గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

జర్నలిజం సమాజానికి అద్దం పట్టే వృత్తి అని, నిజాయితీతో వార్తలను ప్రజలకు అందించడం జర్నలిస్టుల బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. 1996 నుంచి తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల అభివృద్ధికి సేవలు అందిస్తోందని, పుస్తక ప్రచురణలు, మోనోగ్రాఫ్‌లు, శిక్షణా కార్యక్రమాలు మీడియా రంగానికి ఉపయోగపడుతున్నాయని అభినందించారు.

ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు కె. రాంచందర్ మూర్తి, కేశవరావు దాసు, ఎస్. నాగేష్ కుమార్, బండారు శ్రీనివాస్ రావు, రవీందర్ ఎం.పీ., దిలీప్ రెడ్డి, మాదభూషి శ్రీధర్, ఎం. సుబ్బారావు, జగన్, శ్రీ ఆర్.వి. రామారావు, ఎస్. వినయ్ కుమార్, వై. నరేందర్ రెడ్డి, విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం ముగింపులో సమావేశానికి హాజరైన సీనియర్ జర్నలిస్టులను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు శాలువాలతో సత్కరించారు.

Share this post
Exit mobile version