Site icon MANATELANGANAA

జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వైద్య సేవలు అందించాలి

జర్నలిస్టుల హెల్త్ కార్డులతో అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి


హనుమకొండ, సెప్టెంబర్ 17: జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా హెల్త్ కార్డులు ఇచ్చి అన్ని ప్రైవేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి నారా సుబ్రమన్యేశ్వర రావు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ప్ర రెడ్డి ని కోరారు.


ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి ని హనుమకొండలో కల్సి సంఘం వినతిపత్రం సమర్పించారు.

పలు ప్రైవేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో జర్నలిస్ట్ హెల్త్ కార్డులను అంగీకరించడం లేదని, దీంతో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్యం పొందడంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ వెల్‌నెస్ సెంటర్లలో కూడా అవసరమైన స్థాయిలో వైద్య సదుపాయాలు, సిబ్బంది అందుబాటులో లేవని సంఘం పేర్కొంది. కొన్ని కేంద్రాల్లో స్పెషలిస్ట్ వైద్యులు, వైద్య పరికరాలు, ఇతర సిబ్బంది కొరత ఉందని తెలిపింది. వెల్‌నెస్ సెంటర్ల సంఖ్య, అందుబాటులో ఉన్న సిబ్బంది అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల అవసరాలను తీర్చేందుకు సరిపోవడం లేదని, దీంతో సాధారణ వైద్యం కోసం కూడా ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని పేర్కొంది.
జర్నలిస్టులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని, అందువల్ల వారికి సకాలంలో వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని సంఘం తెలిపింది.
వినతిపత్రంలో సంఘం పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది:
• ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు అంగీకరించే అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్ట్ హెల్త్ కార్డులను కూడా అంగీకరించేలా చర్యలు తీసుకోవాలి.
• ప్రముఖ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ పథకంలో చేర్చాలి.
• సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డుదారులకు అందుతున్న స్థాయిలో జర్నలిస్టులకు కూడా వైద్య సదుపాయాలు కల్పించాలి.
• అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ వెల్‌నెస్ సెంటర్ల సంఖ్యను పెంచాలి.
• వెల్‌నెస్ సెంటర్లలో తగిన సంఖ్యలో వైద్యులు, స్పెషలిస్ట్ వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించాలి.
• అవసరమైన వైద్య పరికరాలు, నిర్ధారణ పరీక్షల సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలి.
• అత్యవసర పరిస్థితులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలి.
• జర్నలిస్టులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సకాలంలో వైద్య సేవలు అందించాలి.
జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ కోరింది.

Share this post
Exit mobile version