Site icon MANATELANGANAA

కృత్రిమ మేధ రంగంలో దూసుకు పోతున్న తెలంగాణ -మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: కృత్రిమ మేధ (AI) రంగంలో తెలంగాణ రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని, అమెరికా పెట్టుబడిదారులకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

ప్రతిష్టాత్మక “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026”లో భాగంగా అమెరికా-ఇండియా వాణిజ్య మండలి (USIBC) ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కీలక ప్రసంగం చేశారు.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూల వాతావరణం తెలంగాణలో ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎకోసిస్టం కొత్త పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధనలకు దోహదపడుతోందన్నారు. అమెరికా టెక్ కంపెనీలతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు.

ముందుచూపుతో రూపొందించిన స్థిరమైన విధానాలు ఏఐ పరిశోధనలకు బలంగా నిలుస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రజా సేవల్లో రియల్ టైం పర్యవేక్షణ కోసం కృత్రిమ మేధ వినియోగాన్ని విస్తృతంగా పెంచామని వెల్లడించారు.

ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణను ఏఐ రంగంలో ముందంజలో నిలబెట్టామని చెప్పారు. ప్రపంచంలోనే ప్రముఖ ఏఐ కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

టెక్నాలజీ ప్రపంచంలో వేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రాన్ని పోటీకి సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ యూనివర్సిటీ, ఏఐ హబ్‌ల స్థాపనతో పాటు నైపుణ్యవంతులైన యువతను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Share this post
Exit mobile version