Site icon MANATELANGANAA

న్యూఢిల్లీలో మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సు

పాల్గొన్న తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ఒకరోజు మీడియా & కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖకు చెందిన జిల్లా పౌర సంబంధాల అధికారులు, మీడియా నోడల్ అధికారులు, సోషల్ మీడియా నోడల్ అధికారులు పాల్గొన్నారు.

దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 240 మంది జిల్లా పౌర సంబంధాల అధికారులు హాజరైన ఈ సదస్సులో ఎన్నికల నిర్వహణలో కమ్యూనికేషన్ పాత్ర, మీడియా నిర్వహణ, ఎన్నికల చట్టాలు, డిజిటల్ సాంకేతికత వినియోగం, తప్పుడు ప్రచారాల నియంత్రణ, సోషల్ మీడియా సవాళ్లు, ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేసే విధానాలపై ఎన్నికల సంఘం అధికారులు సమగ్రంగా వివరించారు.

ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణలో మీడియా, ప్రజా సంబంధాల అధికారుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసే అధికారిక సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయడంతో పాటు తప్పుడు ప్రచారం, అపోహలు, దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత కమ్యూనికేషన్ అధికారులపై ఉందని పేర్కొన్నారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, పౌరసత్వ చట్టం-1955 నిబంధనలకు అనుగుణంగా అర్హులైన భారతీయ పౌరుల పేర్లు మాత్రమే ఓటరు జాబితాలో ఉండేలా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అపోహలు తొలగించి వాస్తవాలను చేరవేయడంలో మీడియా, ప్రజా సంబంధాల అధికారుల పాత్ర అత్యంత ముఖ్యమని చెప్పారు.

సదస్సులో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, ఫారం-17సీ, ఆర్టికల్-324 కింద ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలు, ఎన్నికల ప్రచార నిబంధనలు, పెయిడ్ న్యూస్ నియంత్రణ, సోషల్ మీడియా, కృత్రిమ మేధ వల్ల ఎదురవుతున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనే వ్యూహాలపై ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇచ్చారు.

అలాగే, ఎన్నికల సంఘం రూపొందించిన సమగ్ర డిజిటల్ వేదిక ECINet ద్వారా ఓటరు నమోదు, ఓటరు వివరాల సవరణ, పోలింగ్ కేంద్రాల సమాచారం, అభ్యర్థుల అఫిడవిట్లు, ఎన్నికల ఫలితాలు తదితర సేవలను ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన విధానాన్ని వివరించారు. ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు ECINetను వినియోగించేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.

సదస్సులో ఎన్నికల కమ్యూనికేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించే విధానాలు, మీడియాతో సమన్వయం, సోషల్ మీడియా వినియోగం, ప్రజల్లో ఎన్నికలపై అవగాహన పెంపు, తప్పుడు ప్రచారాన్ని వేగంగా ఖండించే వ్యూహాలపై విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేశారు.

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారుల కార్యాలయం నుంచి అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎన్. శంకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రసన్నరాజ్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ సంయుక్త సంచాలకులు యు. వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ
కమిషనరేట్ పౌర సంబంధాల అధికారులు ఎం. కిరణ్మయి, ఏ. వనజతో పాటు మీనాక్షి, ఇందిర, అనిల్, విశ్వేశ్ తదితర జిల్లా ప్రజా సంబంధాల అధికారులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version