Site icon MANATELANGANAA

కిట్స్‌ వరంగల్‌లో ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్స్‌-2026-27 ముగింపు

వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పురుషుల విభాగంలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్స్‌ 2026-27 ఫేజ్‌-1 పోటీలు ముగిశాయి. కిట్స్‌ వరంగల్‌ క్యాంపస్‌లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమం, బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు.

కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) వరంగల్‌ ఆధ్వర్యంలో, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ఈ పోటీలను నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలకు చెందిన 46 కళాశాలల నుంచి 972 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

పోటీల్లో మొత్తం ఆరు క్రీడాంశాలను నిర్వహించారు. ఇండోర్‌ గేమ్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, ఔట్‌డోర్‌ గేమ్స్‌లో ఫుట్‌బాల్‌, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ పోటీలు జరిగాయి.

ఈ సందర్భంగా కిట్స్‌ వరంగల్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా పరస్పర సంబంధాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చని అన్నారు. క్రీడలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

కిట్స్‌ వరంగల్‌ చైర్మన్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ వి. లక్ష్మీకాంతరావు, ట్రెజరర్‌ శ్రీ పి. నారాయణరెడ్డి, కిట్స్‌ అదనపు కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీ వి. సతీష్‌కుమార్‌ విజేతలు, రన్నరప్‌లను అభినందించారు. క్రీడాకారుల ప్రతిభను ప్రశంసించారు.

కిట్స్‌ వరంగల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ ప్రొఫెసర్‌ పి. రమేష్‌ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ టోర్నమెంట్‌ ద్వారా ఈ ప్రాంతంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, ఉన్నత స్థాయిలో పోటీ పడేందుకు అవకాశం లభించిందన్నారు.

యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవసరమైన సౌకర్యాలను కిట్స్‌ వరంగల్‌ కల్పిస్తోందని, విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

కార్యక్రమంలో కిట్స్‌ వరంగల్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. కోమల్‌ రెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎం. శ్రీనివాస్‌ రెడ్డి, ఫిజికల్‌ డైరెక్టర్లు వెంకటస్వామి, మహేష్‌, నాగరాజు, డాక్టర్‌ ఏటిబిటి ప్రసాద్‌, డాక్టర్‌ శ్రీధర్‌, శశికాంత్‌, గోపీ కృష్ణ, నరేందర్‌, సుమన్‌తో పాటు డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

కెమిస్ట్రీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పీఆర్వో డాక్టర్‌ డి. ప్రభాకర చారి, 972 మంది క్రీడాకారులు కార్యక్రమానికి హాజరయ్యారు.

Share this post
Exit mobile version