*
దేశంలోనే తొలిసారిగా “లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ”
*
స్టార్టప్స్, ఇన్నోవేషన్స్ కోసం ప్రత్యేకంగా “ఫండ్స్ ఆఫ్ ఫండ్స్”
*
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి
“క్వాంటం సిటీ”గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. “క్వాంటం టెక్నాలజీ”లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా “లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ”ని రూపొందించామన్నారు. గచ్చిబౌలిలోని “ఐఐఐటీ హైదరాబాద్”లో “నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం & తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ”ని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయన్నారు. అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. “లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ”లో భాగంగా రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్, టాలెంట్ పైప్‌లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. క్వాంటం సెన్సింగ్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, క్వాంటం కంప్యూటింగ్ లో ఆర్అండ్ డీ, ఇన్నోవేషన్స్ ను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ఇది కేవలం తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమే కాదని, క్వాంటం టెక్నాలజీలో దేశానికి దిశా నిర్దేశం చేసే “డైరెక్షన్” అని అన్నారు. ఈ టెక్నాలజీ లో దేశానికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా ప్రత్యేకంగా “సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్”కు కూడా శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్స్, కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా “ఫండ్స్ ఆఫ్ ఫండ్స్”ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. “ఇండస్ట్రీ డే” పేరిట ప్రతి వారంలో ఒకరోజు అధికారులు, ప్రతి నెలలో ఒక రోజు సంబంధిత మంత్రి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారన్నారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, మెంబర్ డా. వీకే సారస్వత్, దేబ్ జానీ ఘోష్, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
