మున్నూరు కాపులు ఎవ్వరు ??
వ్యాసకర్త : డా. తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
రెండు తెలుగు ప్రాంతాల్లో, మహారాష్ట్రలోని నాందేడ్ లాతూర్ జిల్లాలలో మున్నూరు కాపులు మనుగడ సాగిస్తున్నారు. బీసీ వర్గాల్లో ఒకరుగా చలామణి అవుతున్న ఈ మున్నూరు కాపులు ఎవ్వరు? వారి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? వీరు రెడ్ల సామాజిక వర్గంలో అంతర్భాగమేనా??
▪️పరిచయం
మున్నూరు అనే పదము సంస్కృత పదమైన త్రిశతికి తెలుగు అనువాదము . కాపు అనే పదం కాపుదానం వృత్తికి , కాపు గాసే రక్షణకు పర్యాయం. మున్నూరు కాపులకు సంబంధించి ఇక్కడ " కాపు " అనేది మాత్రమే కులం. మూడు నూర్లు లేదా మున్నూరు అనేది వాళ్ళ సంఖ్య చిలుకూరి వీరభద్రరావు గారు పేర్కొన్నారు..అంటే కాపుల్లోనే మూడునూర్ల కాపులు ఉన్నారు అనేది చరిత్ర.
వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే రెడ్లను ఒకప్పుడు ప్రభుత్వ గుర్తింపు లెక్కల ప్రకారం కాపులుగా పరిగణించే వాళ్ళు. పాఠశాలల్లో విద్యార్థులని చేర్చేటప్పుడు కులం విభాగంలో 70వ దశకం వరకు" కాపులు" అనే రాసేవాళ్ళు. ఇప్పటికీ తెలంగాణ రాయలసీమ పల్లెల్లో రెడ్లను కాపులు అనే వ్యవహరిస్తారు.
▪️మున్నూరు కాపుల సామాజిక రాజకీయ చరిత్ర
మున్నూరు కాపులు రెడ్ల సామాజిక వర్గంలో అంతర్భాగంగా చరిత్ర వివరిస్తున్నది.
|| రెడ్ల మాతృ శాఖలు ||
మాతృశాఖలుగా రెడ్లల్లో మొత్తం 36 శాఖలు ఉన్నాయి. రెడ్ల కుల గురువు భక్త మల్లారెడ్డి చరిత్రలో ఈ శాఖలు పేర్కొనబడ్డాయి. వీటి నుండి మిగతా శాఖలు కాలక్రమంలో ఒక శాఖ నుండి విడివడి అంత: శాఖలుగా ఏర్పడ్డాయి. నివసించే ప్రాంతాన్ని బట్టి, సంస్కృతి సంప్రదాయాన్ని బట్టి, అనుసరించిన వృత్తి విధానాన్ని బట్టి, జీవనశైలిని బట్టి ఆచరించిన విధి విధానాలను బట్టి మిగతా రెడ్డి శాఖలు ఏర్పడ్డాయి.
1.మోటాటి 2. వెలనాటి 3.మొరస, నేరేటి,5. అయోధ్య, 6. పంట 7. పొంగలి నాటి 8. పాకనాటి 9. భూమంచి 10. కురిచేటి 11. #మున్నూటి 12. దేసట్టి 13. ఓరుగంటి 14. గండికోట 15. కమ్మపురి 16. గోన 17. చిట్టెపు 18. కుంచెడుగా 19. గాజుల 20. కొణిద 21. పెడకంటి 22. గుడాటి 23. గోనుగంటి 24. దేసూరి 25. నానుగండ 26. నెరవాటు 27. పల్లె 28. బలిజ 29. భూస 30. తొగర్చేడు 31. ఎడమ/ఎడ్లను 32. రేనాటి 33. లాలిగుండ34. సజ్జన 35. సాదర 36. అరిటాకు.
ఈ మాతృ శాఖల్లో మున్నూటి శాఖ ఉన్నది. మున్నూటి శాఖనే మున్నూరు శాఖగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మున్నూరు శాఖ బిసి వర్గాల్లో ఉన్నది. ఒక్క మున్నూరు శాఖ మాత్రమే కాదు ~ తెలంగాణ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గంగా చెప్పబడుతున్న లక్కమారి... రెడ్డి గాండ్ల శాఖలు, ఉత్తరాంధ్రలో రెడ్డిక శాఖ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బీసీ వర్గాల్లో చేర్చబడ్డాయి.
|| 15 వ శతాబ్దంలో ||
పంటాన్వయమునను పద్నాల్గుశాఖల
జక్కగా వివరింతు సత్యమరసి
మొటాటి వెల్నాటి మొరస నేరే డయోద్య
పంట పొంగలినాటి పాకనాటి
భూమంచి కురిచేటి #మున్నూటి దేసటి
యొనర గండియకోట యోరుగంటి
యన ఒరగుచునుండు నంధ్రావనీస్థలి
గౌరవాదిష్ఠిత కాపు కులము
పంట పదునాల్గు కులములం చంట జగతి
దర తరంబుల నుండియు వరలెడినుడి
వీనికుపజాతు లున్నవి వివిధములుగ
భుజబలాటోప పిన్నమ బుక్క భూప"
15 వ శతాబ్దంలో ఉదయగిరి చంద్రగిరి రాజ్యాలను పాలించిన సాళువ నరసింహారాయుల సామంత మండలాధీశ్వరుడు ఆరవీటి బుక్కభూపతి కాలంలో
దేవల్రాజు అను భట్టురాజు చెప్పిన
ఈ సీస పద్యంలో పంట 14 తెగలు =
(1) మోటాటి (2) వెలనాటి (3) మొరస (4) నెరాటి (5) అయోద్య (6) పంట (7) పొంగలినాటి (8) పాకనాటి (9) భూమంచి (10) కురిచేటి (11) #మున్నూటి (12) దేసటి (13) గండికోట (14) ఓరుగంటి .
▪️మున్నూరు కాపుల శాసనాల్లో రెడ్డి నామాలు
1. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి ఆలయ మందలి శాసనాలు
"చతుర్థవంశమున జన్మించిన వాడును. నూకనార్యుని పుత్రుడు వినయాకరుడును, విఖ్యాతుడును, నైన పెదమున్నూటి వీరపనాయకు డును, వీరపరెడ్డికిని, లక్ష్మీసమానురాలైన లక్ష్మాంబకును జనించినట్టియు శ్రీలలో ఉత్తమరాలును...." అంటూ ఆరంభించబడిన ఈ శాసనంలో శా॥శ॥ 1174 (క్రీ. శ. 1252) సంవత్సరాలు పేర్కొనబడినవి.
2. జయంతిపుర శాసనము, కొండపల్లి అప్పిరెడ్డి శాసనము
శీలం హనుమంతు పునరుద్ధారణ ఆంజనేయ ప్రతిష్ట :
స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశకవర్షంబులు 1528 ఆగు నేటికి ప్లవంగ నామ సంవత్సర శ్రావణ శుద్ద ౫ శనివారము నాడు కొండపల్లి మున్నూరు విషయవ్మాన్ మున్నూరుకులాలంకార పెద తిమ్మారెడ్డి కుమారుడు అప్పిరెడ్డి తమ పినతండ్రి పెదపిచ్చి పినతిమ్మారెడ్డిగారి అనుజ్ఞను ఆచంద్రార్క స్థాయిగా గరుడిగంభందం ప్రతిష్టించెను శ్రీముఖనామ సంవశ్సర శ్రావణ బహుల ౧౩ ఆది వారం శీలం ఎల్లప్ప రెడ్డి కుమాళ్లు హనుమంతు, బందు, అభిమాన భక్తి అభిమాన గను పునరోద్ధాదిక ఆంజనేయుల ప్రతిష్ఠించెను.
3.ఇక్షుపుర _ కదారనాగమనాయకుని శాసనము శా. శ 1066 ( క్రీ.శ 1144 )ఉత్త రక్రొధి సంక్రాంతి నిమిత్త మున్న ఇక్షుపురి రాజ్యపాలకుడైన మున్నూరురెడ్డి మారుడైనవుండెన కడారి నాగమనాయకుడు శ్రీత్రివిక్రమ దేవరకు చెట్టిన ఆఖండపర్తి దేయకులో త్తుంగమాడలు....
|| మున్నూటి / మున్నూరు - చరిత్రకారుల వివరణ||
1. మున్నూటి శాఖ పంట రెడ్లలో భాగంగా పేర్కొనబడింది ..పాకనాడు, వెలనాడు మొట్టవాడి, మొరస, మున్నూటి , పంట, నేరేటి, పొంగలినాడు ఇవన్ని దేశీ విభాగాలే అని ప్రముఖ చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ పేర్కొంటున్నారు..
అట్లాగే మున్నూటి విషయము ములికినాడు (ములికి మున్నూరు ) అని కూడా వీరు పేర్కొన్నారు.
2. మరో చరిత్రకారుడు వైవి రెడ్డి యానాల గారు మున్నూరు అంటే ముల్కీ ప్రాంతంలోని 300 రాజ్యాల వారు అని అర్థం అంటూ పేర్కొన్నారు.
3. అడివి బాపిరాజు తన " గోనగన్నారెడ్డి'' నవలలో గోన గన్నారెడ్డి శౌర్య ప్రతాపాల గురించి ప్రస్తావిస్తూ......
కాకతీయ గుణపతి కుమార్తె రుద్రమదేవికి కుడి భుజంగా ఉన్న మహామాండలిక ప్రభువు గోన గన్నారెడ్డి. ఆనాడు ఆంధ్రదేశమంతా నిండి వున్న రెడ్డి వెలమ కమ్మ - బలిజ. మున్నూరుకాపు మొదలగు ఆంధ్రుల పూర్వీకులు, దుర్జయ కులజులు అగు ఆంధ్ర క్షత్రియ జాతికి చెందిన గోన గన్నారెడ్డి మహావీరుడు.
▪️మున్నూరు కాపులు - ప్రముఖుల వివరణ
" మున్నూరు కాపుకుల అభ్యుదయము " గ్రంథంలో మున్నూరు కులం గురించి అనేక చారిత్రక అంశాలు చర్చించబడ్డాయి. మున్నూరు కాపు కుల అభ్యుదయం కోసం పాటుబడ్డ బొజ్జం నర్సింలు గారు ఈ వివరాలను సేకరించారు.
1) కొండా వెంకట రంగారెడ్డి గారి వివరణ యాధాతథంగా
" మున్నూరుకాపు వారంటె కాపు (రెడ్డి) కులములోని వారే. ఆంధ్రప్రదేశములో కాపు తెగలు 60 కంటె మించి యున్నవి. దీని వివరణ 'రెడ్డికుల నిర్ణయ చంద్రిక'లో నున్నది. అందులో వీరొకరు. వీరి ప్రత్యేక వృత్తిలేదు. అయినప్పటికిని వీరి నిజమైన వృత్తి వ్యవసాయమని స్పష్ట పడుచున్నది. ఇప్పుడు వీరు ఆంధ్రరాష్ట్రములో ముఖ్యముగా తెలంగా ణములోని పట్టణాలలో నివసించి, తెలివితేటలు, చురుకుతనముతో వర్త కము చేస్తు, అనేకులు ధనము గడించినారు. గ్రామాదులలో వ్యవసా యము చేయుచున్నారు. వీరిలో ఇప్పుడిప్పుడు చాలామంది చదివి పండితులు, వకీళ్లు, డాక్టర్లు, ఇంజీనీర్లు అయినారు. ప్రభుత్వ ఉన్నతోద్యోగులలో ప్రవేశించినారు. తెలంగాణంలోని ధనవంతులలో చెప్పుకోబడుతున్నారు "
ఈ వివరణ ప్రకారం కూడా మున్నూరు కాపులు రెడ్లలో అంతర్భాగంగా చెప్పబడుతున్నారు.
2 ) బి. యన్. శర్మ , ఆంధ్రవాణి పత్రికా సంపాదకుడు
గారి వివరణ
యాధాతథంగా
క్షేత్రధర్మము, కృషిధర్మ నిర్వహణముతోబాటు రాజ్య రక్షణ, ప్రజారక్షణయందు ఆదర్శప్రాయముగా రాజ్యపాలనము గావించి ....సీతామహాదేవి స్వయంవర సమయమునందు శివధనుస్సును గదల్చి తెచ్చిన మున్నూరు మహావీరుల....
&
'రామాయణము' నందేగాక వ్యాసప్రోక్తమైన భారతమునందు, భాగవతమునందు గల 'త్రిశత' శబ్ద మీ మున్నూరుకాపుల వర్ణితము.
దేశమునందు వర్ణవ్యవస్థ యేర్పడినప్పుడు వీరు వైశ్య వర్ణులుగా నుండిన యాధారములు గలవు. వాణిజ్య, వ్యవసాయ, పశు పోషణ, వైశ్యవృత్తులగుటం జేసి ... 1 వాణిజ్యవైశ్యులు 2. భూవైశ్యులు, 3. గోవైశ్యులను మూడువిధము లుండునటుల గలదు, వైశ్యవర్ణాంతర్గత మైన కాపులు భూవైశ్యులైరి. దేశమందలి కొన్ని భాగములను యాదర్శప్రాయముగా పరిపాలించిన యానాటి కాపు మహారాజుల ధ్వజము నందు నాగలిచిహ్న ముండి యుండెను. చాళుక్యుల, చోడుల రాష్ట్రకూటుల కులమే వీరి కులము.
ఈ వివరణ ప్రకారం మున్నూరు కాపులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అని మరోమారు అర్థం అవుతున్నది. . ఎడ్గార్ థర్స్టన్ , C.I.E., అనే అసఫ్జాహీల కాలంనాటి చారిత్రక పరిశోధకుడు తన " దక్షిణ భారతదేశంలోని కులాలు మరియు తెగలు " గ్రంథంలో రట్టలు శ్రీరాముడి వంశానికి అనుసంధానం చేస్తూ చెప్పుకొచ్చాడు. రట్ట = అంటే రెడ్ల పూర్వ నామం. రట్ట ~ రట్టోడి ~ రెడ్డి అయ్యాడు. ఈ నేపథ్యంలో...మున్నూరు కాపులు ఇక్కడ శ్రీరాముడు శివధనస్సును ఎత్తడానికి, ఆ ధనస్సును కదిలించి తెచ్చిన మహావీరులుగా చెప్పబడుతున్నారు. ఈ విధంగా మున్నూరు కాపులు, రట్టలు, ఒక దగ్గరే కనిపిస్తున్నారు.
ఈ వివరణ గురించి చారిత్రక సమాలోచన చేస్తే....జనక మహారాజు సీతా స్వయంవరం సమయంలో తమ సైనికుల్ని / కాపు గాసే వాళ్ళని / రక్షకుల్ని/ పవిత్రమైన శివ ధనుస్సును స్వయంవరం మందిరానికి తీసుకురావలసిందిగా కోరుతాడు. జనక మహారాజు ఆదేశం ప్రకారం మొదట ఒక నూరు మంది వెళ్లి ప్రయత్నం చేస్తే సాధ్యపడదు. తరువాత మారో నూరు మంది వెళ్లి ప్రయత్నం చేసి విఫలమవుతారు. ఆ తర్వాత మరో నూరు మంది వెళ్లి ప్రయత్నం చేయడంతో శివధనుస్సు కదులుతుంది ఈ విధంగా మూడు నూర్ల కాపులు ఆ ధనస్సును స్వయంవర మందిరానికి తీసుకొస్తారు. ఈ మూడు నూరుల కాపులే మున్నూరు కాపులుగా రూపాంతరం చెందినారనేది కుల చరిత్ర.
▪️రెడ్ల అధ్యక్షతలో మున్నూరు కాపుల సమావేశాలు
పీల్ఖానా అంజనేయ దేవాలయ ప్రాంగణంలో , 11-8-40 న సురవరము ప్రతాపరెడ్డిగారి అధ్యక్షతన మున్నూరు కాపు కుల సమావేశం జరిగింది .
ప్రతాపరెడ్డి గారు ప్రారంభోవవ్యాసమ చేస్తూ... "చాతుర్వర్ణాల గురించి మాట్లాడుతూ... కాపులలో మున్నూరు కాపులు, రెడ్లు, ఉన్నారని చెప్పాడు
▪️మున్నూరు కాపుల వ్యవహార నామాలు
మున్నూరు కాపు కులస్తులు ఉత్తర భారత దేశమైన మిథిలా అయోధ్య నగరం నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన వారు. వీరు మొదట " రత్నగర్భ " అనే పూర్వ నామం కలిగిన తెలంగాణ ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని విస్తరించారు.
దక్షిణ తెలంగాణ గద్వాల ప్రాంతంలో నివసించే మున్నూరు కాపులను నాయకోళ్లు అంటారు. నాయకులు అనే పదం నుండి ఈ పదం స్థిరపడింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో మున్నూరు కాపులు పేర్ల వెనక రెడ్డి అని ఉంటుంది.
సామాజికంగా ఈ మున్నూరు కాపులు పటేల్ అని వ్యవహరించబడతారు.
మున్నూరు కాపులను తెలంగాణాలో చరిత్ర ప్రకారం 3 నూర్లా కాపులు అంటారు., కర్ణాటకలో మున్నూరు రెడ్లు అంటారు తమిళనాడులో నాయకర్లు,కేరళలో నాయర్లు , మహారాష్ట్రలో కుంభి, బిహార్లో కూర్మి, వీళ్ళంతా మున్నూరు కాపులకు చెందిన వాళ్ళే. చరిత్రకారులు మహారాష్ట్ర కుంభీలను తెలుగు సమాజంలో రెడ్డి సామాజిక వర్గానికి సమానమైన వాళ్ళుగా పేర్కొన్నారు .
- మున్నూరు కాపుకుల అభ్యుదయము కార్యకలాపాలు (1920-67)
బొజ్జం నర్సింలు
- మున్నూరు కాపువారి శాసనములు
దివ్యవాణి పత్రిక, మార్చి 3 – 1941
*మున్నారు కాపు పూర్వ చరిత్ర పరిశోధక మండలి హైద్రాబాద్ గౌలిగూడ
- రెడ్డి కుల నిర్ణయ చంద్రిక
- Castes and Tribes of Southern India
దక్షిణ భారతదేశంలోని కులాలు మరియు తెగలు
వ్యాసకర్త :
Edgar Thurston, C.I.E.,
ఎడ్గార్ థర్స్టన్ , C.I.E.,
డా. తంగెళ్ళశ్రీదేవిరెడ్డి ఫేస్ బుక్ వాల్ నుండి