‘వెన్నుపోటుకు మారు పేరు రేవంత్ రెడ్డి’
హైదరాబాద్, డిసెంబర్ 22:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు స్థిరమైన స్టాండ్, సిద్ధాంతం, పద్ధతి ఏదీ లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.
కేసీఆర్ ఒక స్టేట్స్‌మన్‌లా మాట్లాడితే.. రేవంత్ రెడ్డి మాత్రం స్ట్రీట్ రౌడీలా మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. త్యాగాల చరిత్ర తమదైతే, వెన్నుపోటుకు మారు పేరు రేవంత్ రెడ్డేనని వ్యాఖ్యానించారు. సంకుచితమైన, మరుగుజ్జు మనస్తత్వంతో సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తిగా రేవంత్‌ను కేసీఆర్ ప్రజల ముందు నిలబెట్టారని అన్నారు.
కేసీఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సీఎం, నీళ్ల మంత్రికి ఎందుకంత నొప్పి వస్తోందని హరీష్ రావు నిలదీశారు. ఎవరి ఒత్తిడితో రాష్ట్ర నీటి వాటాను తగ్గించుకున్నారని ప్రశ్నించారు. 45 టీఎంసీల నీటి విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా తన సంతకంతో కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ ‘ఉత్తర కుమారుడిలా’ మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుభవమంతా దోపిడీ, లూటీకే ఉపయోగపడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నంలో రూ.50 లక్షలతో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డేనని ఆరోపించారు.
రూ.50 కోట్లకు రేవంత్ పీసీసీ పదవి కొనుగోలు చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డే వెల్లడించారని హరీష్ రావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి ఒక్క స్టాండ్, సిద్ధాంతం, విధానం కూడా లేదని మరోసారి విమర్శించారు.
ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల తయారీలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని హరీష్ రావు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా సిద్ధమై ప్రెస్‌మీట్లు నిర్వహించాలని ఎద్దేవా చేస్తూ.. నీళ్ల మంత్రికి సగం సగం నాలెడ్జ్ మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు.

