Site icon MANATELANGANAA

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రేవంత్ రెడ్డి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు: హరీశ్ రావు

harishrao

హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషికి క్రెడిట్ కొట్టేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు విమర్శించారు. మంచిరేవుల, మియాపూర్, భూపాలపల్లి భూముల వ్యవహారాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం, తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ భూములను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటి ఫలితాలను తన ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు.

మంచిరేవుల భూముల విషయంలో మాట్లాడుతూ.. 142 ఎకరాల గ్రేహౌండ్స్ భూముల విలువ సుమారు రూ.10 వేల కోట్లు ఉంటుందని, ఈ భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్ రావు తెలిపారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ న్యాయవాది హాజరుకాకపోవడంతో సింగిల్ జడ్జి వద్ద భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని పేర్కొన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులు సి.ఎస్. వైద్యనాథన్, గిరి ద్వారా హైకోర్టు డివిజన్ బెంచ్‌లో, అనంతరం సుప్రీంకోర్టులో పోరాటం చేసి భూములను తిరిగి ప్రభుత్వపరం చేసిందన్నారు. 2021 డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో, 2023 ఆగస్టు 1న సుప్రీంకోర్టులో జరిగిన న్యాయపోరాటం ఫలితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితం వచ్చిందని వివరించారు.

అయితే ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఆధీనంలోని భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. రాత్రికి రాత్రే కాంపౌండ్ వాల్ కూల్చివేసి, 10 ఎకరాల 10 గుంటల భూమిని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్‌కు చెందిన కె. సంతోష్ రెడ్డి తదితరుల పేరిట కన్వేయన్స్ డీడ్ చేశారని అన్నారు. డాక్యుమెంట్ నంబర్ 8886/2026 ద్వారా గండిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైన ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.45.39 కోట్లు ఉంటుందని, అయినప్పటికీ ఎలాంటి కన్సిడరేషన్ ఫీజు లేకుండా బదిలీ చేశారని ఆరోపించారు. ఫైరింగ్ రేంజ్ కోసం ఉద్దేశించిన మరో 10 ఎకరాల భూసేకరణ రద్దయినా ప్రభుత్వం మూడు నెలలుగా అప్పీల్ చేయలేదని విమర్శించారు.

మియాపూర్ భూముల వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్ రావు అన్నారు. అప్పట్లో సీఐడీ విచారణ జరిపించి, ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లను సస్పెండ్ చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించామని తెలిపారు. 2016లో జీవో నంబర్ 45 ద్వారా జాగీర్ అబాలిషన్ చట్టానికి చట్టబద్ధత కల్పించామని, సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ద్వారా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సుదీర్ఘ న్యాయపోరాటం చేసి ట్రినిటీ భూములను ప్రభుత్వపరం చేసేందుకు కృషి చేశామని వివరించారు.

సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 86 సార్లకు పైగా వైద్యనాథన్ వాదనలు వినిపించారని, కేసు తుది దశకు చేరుకుందని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 11 సార్లు మాత్రమే వాదనలు జరిగాయని చెప్పారు. తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విజయాన్ని తన ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. కనీసం తీర్పు కాపీ కూడా రాకముందే ఆ భూములను విక్రయానికి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

భూపాలపల్లి అటవీ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ.. 1994 నుంచి 2014 వరకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఈ భూములకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉందని హరీశ్ రావు తెలిపారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం సింగిల్ జడ్జి వద్ద కేసును గెలిచిందన్నారు. అనంతరం డివిజన్ బెంచ్‌లో ప్రైవేట్ వ్యక్తికి అనుకూలంగా తీర్పు రావడంతో వారు భూముల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలో యంత్రాలను సీజ్ చేయించి, నలుగురిని అరెస్టు చేయించామని చెప్పారు.

ఆ తర్వాత మే 2021లో సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ నంబర్ 6937/2021 దాఖలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయపోరాటం కొనసాగించిందని, 2024 ఏప్రిల్‌లో తీర్పు వెలువడిందని వివరించారు. ఈ కేసులో కూడా గత ప్రభుత్వమే కీలకంగా పోరాడిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫలితానికి క్రెడిట్ తీసుకోవడం సరికాదని హరీశ్ రావు విమర్శించారు.

ప్రభుత్వ భూములను కాపాడిన విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించాలని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని గుర్తించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వమే భూములను రక్షించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

Share this post
Exit mobile version