జనగామ జిల్లా పాలకుర్తిలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి కోట్ల రూపాయలు దోచుకున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు.
స్వాధీనం చేసిన వస్తువులు
ముఠా వద్ద నుంచి రూ.5 లక్షల 92 వేల నగదు, 684.5 గ్రాముల బంగారు నాణాలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మెషిన్, చెక్ బుక్స్, స్టాంపులు, భూములు మరియు ఇళ్లకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులు
• తెప్పాలి సైదులు (55), స్వగ్రామం గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా – ప్రస్తుత నివాసం పాలకుర్తి.
• మనుబోతుల రామకృష్ణ (36), స్వగ్రామం నందిగామ, కృష్ణా జిల్లా (ఏపీ) – ప్రస్తుత నివాసం పాలకుర్తి.
• పొడిల సురేష్ కుమార్ (35), స్వగ్రామం పెన్‌పహాడ్, సూర్యాపేట జిల్లా – ప్రస్తుత నివాసం పాలకుర్తి.
• పొడిల శ్రీధర్ (30), స్వగ్రామం హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా – ప్రస్తుత నివాసం పాలకుర్తి.
మోసపూరిత పథకం వివరాలు
ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య పేరుతో 2023లో హెబ్సిబా అనే సంస్థను స్థాపించాడు. 2024లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చీటీ వ్యాపారం ప్రారంభించాడు. ఇందులో సభ్యులు రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. అందులో రూ.4,000 తన వద్దే ఉంచుకుని, రూ.2,000 విలువైన వస్తువులు ఇచ్చినట్లు చూపించేవాడు. అయితే ఆ వస్తువుల అసలు విలువ కేవలం రూ.300 మాత్రమే.
ఒక సభ్యుడు ఎన్ని సభ్యత్వాలైనా పొందవచ్చు. ప్రతి సభ్యత్వానికి 20 నెలల పాటు నెలకు వెయ్యి రూపాయలు తిరిగి ఇస్తానని నమ్మబలికేవాడు. ఈ విధంగా గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా సుమారు 28,493 సభ్యత్వాలు నమోదు చేసి, మొత్తం రూ.11.39 కోట్లు వసూలు చేశాడు. అదనంగా తక్కువ విలువ గల వస్తువులు ఇచ్చి మరో రూ.4.84 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తు ఫలితాలు
ఈ డబ్బును నిందితులు 17 బ్యాంకుల్లో జమ చేసినట్లు తేలింది. ప్రస్తుతం రూ.5.48 కోట్లకు పైగా ఉన్న ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు సైదులు పై గతంలోనే మెదక్, సూర్యాపేట, ఇల్లందు, ఎల్.బి. నగర్ వంటి పోలీస్‌స్టేషన్లలో పది పైగా మోసం కేసులు నమోదై ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
ప్రజలకు హెచ్చరిక
“ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే తప్పుడు కంపెనీలను నమ్మరాదు. ఇలాంటి పథకాలు చివరికి బోర్డులు తిప్పేసి పారిపోతాయి. పెట్టుబడి పెట్టేముందు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి” అని సీపీ ప్రజలకు సూచించారు.
పోలీసులకు ప్రశంసలు
ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు నర్సయ్య, మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పవన్, పాలకుర్తి సీఐ జానకీరాం రెడ్డి, ఎస్‌ఐలు వంశీ కృష్ణ, దిలీప్ తదితరులకnu సీపీ అభినందించారు.
అధిక లాభాల ఆశ చూపించి కోట్లలో మోసం చేసిన ముఠా అరెస్ట్
