రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు.. 91 నమూనాల సేకరణ, 5 సంస్థలకు నోటీసులు
రాష్ట్రంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి ఇతర కొవ్వులను కలుపుతున్నారన్న సమాచారంతో జూలై 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.
తనిఖీల్లో కొన్ని లైసెన్స్ పొందిన సంస్థలు తయారు చేసిన నెయ్యిలో ఇతర కొవ్వులు కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించగా, మరికొన్ని సంస్థలు ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండానే నెయ్యి తయారీ, విక్రయాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత సంస్థల నుంచి నెయ్యి నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపినట్లు తెలిపారు. పరీక్షల ఫలితాల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ ప్రకారం నెయ్యిలో 99.5 శాతం పాల కొవ్వు ఉండాలని, తేమ శాతం 0.5 శాతానికి మించకూడదని కమిషనర్ వివరించారు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి వృక్షజన్య కొవ్వులను కలపడం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 ప్రకారం నిషేధమని తెలిపారు.
హైదరాబాద్‌లో 850 కిలోల నెయ్యి స్వాధీనం
హైదరాబాద్‌లోని క్యూర్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 14 సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 15 నెయ్యి నమూనాలను సేకరించారు. వినియోగానికి అనర్హంగా గుర్తించిన 60 కిలోల నెయ్యిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ప్రయోగశాల నివేదికలు వచ్చే వరకు వాటిని భద్రపరుస్తామని, కల్తీ నిర్ధారణైతే సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 65 సంస్థల్లో తనిఖీలు
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 65 సంస్థలను పరిశీలించారు. 91 నెయ్యి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
వినియోగదారులకు సూచనలు
వినియోగదారులు లైసెన్స్ కలిగిన, విశ్వసనీయ సంస్థల నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ సూచించారు. కొనుగోలు చేసే ముందు FSSAI లైసెన్స్ నంబర్, తయారీ వివరాలు ఉన్న లేబుల్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. కొనుగోలు బిల్లులను భద్రంగా ఉంచుకోవాలని, కల్తీ ఆహార పదార్థాలు లేదా లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖకు ఫిర్యాదు చేయాలని కోరారు.

