భారత్‌లో టెస్లా తొలి ఆల్-ఇన్-వన్ సెంటర్ ప్రారంభం
గురుగ్రామ్‌లో సేల్స్, సర్వీసింగ్, ఛార్జింగ్ సదుపాయాలు ఒక్కచోటే
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ టెస్లా ఇండియా, దేశంలో తన తొలి ఆల్-ఇన్-వన్ సెంటర్‌ను గురువారం గురుగ్రామ్‌లో ప్రారంభించింది. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని చేతుల మీదుగా ఈ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర మాజీ పరిశ్రమ–వాణిజ్య మంత్రి రావు నర్బీర్ సింగ్ కూడా హాజరయ్యారు.
గురుగ్రామ్‌లో ప్రారంభమైన ఈ సెంటర్ ద్వారా రిటైల్, అమ్మకాల తర్వాత సేవలు, వాహనాల డెలివరీతో పాటు ఛార్జింగ్ సౌకర్యాలు ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీఎం నయాబ్ సింగ్ మాట్లాడుతూ, ఈ సెంటర్ గురుగ్రామ్ అభివృద్ధికి కొత్త మైలురాయిగా నిలుస్తుందని, భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి ఇది ప్రోత్సాహకరమైన అడుగని పేర్కొన్నారు.
టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ, భారతదేశం స్వచ్ఛ ఇంధన వైపు సాగేందుకు సహకరించడం కంపెనీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రజల రోజువారీ జీవితంలో సౌకర్యంగా సరిపోయే విధంగా సేవలను అందించడంపై సంస్థ దృష్టి పెట్టిందని తెలిపారు.
“ఈ గురుగ్రామ్ సెంటర్‌లో ఎక్స్‌పీరియన్స్ స్పేస్, మోడల్ Y టెస్ట్ డ్రైవ్‌లు, V4 సూపర్‌చార్జింగ్ సౌకర్యం, అమ్మకాల తర్వాత సేవలు—అన్నీ ఒకేచోట లభిస్తాయి. ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న ఈవి డిమాండ్ దృష్ట్యా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం,” అని అగర్వాల్ వెల్లడించారు. అలాగే టెస్లా ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసే ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు.
ఈ సెంటర్‌లో ముంబయి, ఢిల్లీలో ప్రదర్శించిన టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ ‘Optimus Gen 2’ కూడా సందర్శకులకు అందుబాటులో ఉండనుంది. ఇది పరిశ్రమలతో పాటు భవిష్యత్తులో గృహ వినియోగానికి అనువైన పునరావృత, ప్రమాదకర పనులను నిర్వహించేందుకు రూపొందించిన ఆధునాతన మోడల్.
ఇదిలా ఉంటే, టెస్లా ఈ ఏడాది జూలైలో ముంబయిలో తన తొలి షోరూమ్‌ను ప్రారంభించడం ద్వారా అధికారికంగా భారత మార్కెట్లో అడుగుపెట్టింది. అదే సందర్భంలో సంస్థ తన తొలి భారత మోడల్ ‘మోడల్ Y’ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. రూ.59.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో RWD వెర్షన్‌లో లభ్యమైన ఈ కారు భారత మార్కెట్లో టెస్లా ప్రవేశానికి నాంది పలికింది.
ముంబయి, ఢిల్లీ కేంద్రాల తర్వాత ఇప్పుడు గురుగ్రామ్‌లో ఆల్-ఇన్-వన్ సెంటర్ ప్రారంభించడంతో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, దేశీయ ఈవి మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసినట్టైంది.

