Site icon MANATELANGANAA

ప్రతి పోరడుమంచి పౌరుడైతే…

ప్రతి పోరడు
మంచి పౌరుడైతే..!

✍️✍️✍️✍️✍️✍️✍️

కొంతమంది కుర్రవాళ్ళు
పుట్టుకతో వృద్దులు..
పేర్లకి..పకీర్లకి..పుకార్లకి నిబద్దులు..!

ఇలా అన్న శ్రీశ్రీనే

కొంతమంది యువకులు ముందు యుగం దూతలు..
పావన నవజీవన
బృందావన నిర్మాతలు..!

ఇలా కూడా అన్నాడు..

కత్తికి రెండు పక్కల పదును..
మహాకవి కలానికీ
అన్ని పక్కలా పదునే..!

అయితే ఎటు పోతోంది
నేటి యువత..
ఈ దేశభవిత..!?

వయసు వచ్చే పాటికి
రెక్కలు తొడిగి
విదేశాలకు
పోవాలన్న తపన..
అందుకోసమే యాతన..
ఇది చదువుకున్నోడి తీరు..!

జంక్షన్లు.. ఫంక్షన్లు..
అయితే రాజకీయ నాయకుడు..
లేదంటే సినిమా హీరో..
వీళ్లే రోల్ మోడల్స్..
జీవితానికో ఎజెండా లేక
ఎవరో ఒకరి జెండా మోస్తూ..
ఎంత వయసొచ్చినా
తల్లితండ్రులే
వీరి బరువు మోస్తూ..!

రంగుల చొక్కాలు.
చిరిగుల పంట్లాలు..
చేతిలో మిక్స్చరు పొట్లాలు..
వింత వింత కటింగులు..
హైస్పీడు బళ్ళు..
బాధ్యత లేని బ్రతుకులు..!
అబ్బాయిలైతే నిక్కర్లు..
అమ్మాయిలేమో
బిగుతు బనీన్లు..
పొట్టి ప్యాంట్లు..
ఇదే డ్రెస్..
రోడ్డే అడ్రస్..!
మొబైలే సర్వస్వం..
అందరూ దానికే వశం..!!

ఎక్కడ చూసినా ఇదే మూక..
సినిమా విడుదలైతే హంగామా..
అమ్మ అయ్య పుట్టినరోజు
గుర్తుండదు గాని
అభిమాన నేత బర్త్ డే
ఊరంతటికీ పండగే..
ఎన్నికల్లో ఇతడే కార్యకర్త..
జెండా కట్టేది..
జనాన్ని తెచ్చేది..
అవసరమైతే ప్రత్యర్థిని బెదరించేది..
డబ్బులు పంచేది..
దొంగ ఓటు వేసేది..
అన్నీ యూతే..
నోరిప్పితే బూతే..
సాయంత్రం అందే మందు..
అర్ధరాత్రి దాకా
రోడ్డుపై చిందు..
అందరూ పడుకునే వేళకి
ఇంటికి చేరి
కాలింగ్ బెల్లు మోత..
ఇదేగా ఆధునిక యువత..!

అందరూ అలా అని కాదు..
అయితే అత్యధికం అదే తీరు
గమ్యం తెలియని గమనం..
లక్ష్యం లేని చదువు..
బాధ్యత ఉండని తిరుగుడు..
పెద్దలు సుద్దులు చెబితే సణుగుడు..
కేకలేస్తే తిరుగుబాటు..
చివరికి ఏదో ఉద్యోగంతో
జరుగుబాటు..!

అయితే అక్కడో..ఎక్కడో
మెరిసే ఒక చుక్క..
చిమ్మచీకట్లో వేగుచుక్క..
ఆదర్శాలు..మార్గదర్శనాలు..
బరువులు..బాధ్యతలు..
దేశభక్తి..
మన సంస్కృతిపై
అనురక్తి..!

బానిస పంధాలను
తలవంచి అనుకరించరు..
పోనీ అని అన్యాయపు
పోకడలు సహించరు..
వారికి జాతి ఆహ్వానం..
వారికే జాతి వందనం..!

సురేష్..9948546286
7995666286

Share this post
Exit mobile version