Site icon MANATELANGANAA

ఫీజు రియింబర్స్ మెంట్ ఇక అడ్వాన్స్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇకపై ముందస్తుగానే విద్యార్థుల ఖాతాల్లో: సీఎం రేవంత్ రెడ్డి


• ప్రతి ఏటా రూ.2,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ముందస్తుగా సిద్ధం
• ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయొద్దు
• విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, క్రీడల్లో ప్రతిభకు ప్రాధాన్యం: సీఎం
హైదరాబాద్‌, ఆగస్టు 14: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడంతో పాటు విద్యార్థులకు ముందుగానే నిధులు అందించే విధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని ప్రతి ఏటా ముందస్తుగా జమ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నెక్లెస్‌ రోడ్‌, హెచ్ఎండీఏ మైదానాల ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించి వారికి నివాళులర్పించారు. అనంతరం హెచ్ఎండీఏ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యాసంస్థల యాజమాన్యాలు నిలిపివేయడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వారి ఖాతాల్లో జమ చేసే విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే నిధులను ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో సిద్ధంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి ఏటా రూ.2,400 కోట్లను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసేలా పథకాన్ని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
విద్యతో పాటు నైపుణ్యాలపై దృష్టి
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. కేవలం డిగ్రీ లేదా సర్టిఫికెట్‌ ఉంటే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని, నైపుణ్యాలు ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు ఆ తర్వాత నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కళాశాలలు, స్కిల్స్‌ యూనివర్సిటీ వంటి అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా నర్సింగ్‌ వంటి కోర్సులు చదివిన వారికి జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
చదువులోనే కాకుండా క్రీడలు, సాంకేతిక రంగాల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవాలని సీఎం అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తామని తెలిపారు.
ఏఐతో మారుతున్న ఉద్యోగ రంగం
సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగ రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివితే విదేశాల్లో ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పోటీ పెరిగిందని అన్నారు.
ఏఐ ప్రభావంతో ఇంజనీరింగ్‌, గ్రాడ్యుయేషన్‌, ఐటీ రంగాల్లోని కొన్ని ఉద్యోగాలకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు విద్యార్థులు కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ప్రాధాన్యం
కులాల మధ్య అంతరాలను తగ్గించి వివిధ వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యతో పాటు సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధి పట్ల బాధ్యత పెంపొందించడమే లక్ష్యమన్నారు.
జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం కేవలం జయంతి, వర్ధంతుల నిర్వహణకే పరిమితం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. వారు చేసిన త్యాగాలు, విద్యా రంగానికి అందించిన సేవలను భవిష్యత్‌ తరాలు గుర్తుంచుకునేలా ఈ విగ్రహాలు స్ఫూర్తి కేంద్రాలుగా నిలవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version