Site icon MANATELANGANAA

అహ్మదాబాద్ కోర్టు సంచలన తీర్పు

court juudgement

భార్య అక్రమ సంభంధం పై కోర్టు కెక్కిన భర్తకు షాకింగ్

: భార్యకు విడాకులు, భరణంతో పాటు రూ.25 లక్షల పరిహారం

అహ్మదాబాద్, మే 17, 2025: గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు ఓ వివాదాస్పద విడాకుల కేసులో సంచలన తీర్పు వెలువరించింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకులు కోరిన భర్త పిటిషన్‌ను కోర్టు విచారణ జరిపి షాకింగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. భార్య పై చేసిన ఆరోపణలను కొట్టివేస్తూ, ఆమెకు రూ.25 లక్షల పరిహారం, నెలకు రూ.40 వేలు భరణం, రూ.20 వేలు ఇంటి అద్దె చెల్లించాలని భర్తను ఆదేశించింది.

సబర్మతి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 2006లో గాంధీనగర్‌కు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత వారు అబుదాబిలో స్థిరపడ్డారు. 2012లో వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే, భర్త తనను వేధించాడని, గొడవల కారణంగా 2016లో భార్య భారత్‌కు తిరిగి వచ్చింది. 2017లో సబర్మతి పోలీస్ స్టేషన్‌లో భర్తపై గృహ హింస, మహిళల రక్షణ చట్టం కింద ఆమె ఫిర్యాదు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, భార్య భరణం కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023 జనవరి 20న కోర్టు క్రూరత్వం ఆధారంగా విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు, భార్యకు, వారి కుమారుడికి కలిపి నెలకు రూ.40 వేలు భరణం, రూ.20 వేలు ఇంటి అద్దె, రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. విచారణలో భార్య గృహ హింసకు గురైనట్లు కోర్టు గుర్తించింది.

అయితే, తాను నిరుద్యోగినని, భరణం చెల్లించలేనని భర్త వాదించాడు. కానీ, యూఏఈలో రెండో భార్యతో జీవిస్తున్న అతడు భరణం నుంచి తప్పించుకునేందుకే ఈ వాదన చేసినట్లు కోర్టు తేల్చింది. దీంతో భార్యకు భరణం, పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఈ తీర్పు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గృహ హింస చట్టం కింద మహిళల రక్షణకు కోర్టు ప్రాధాన్యత ఇచ్చినట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Share this post
Exit mobile version