Site icon MANATELANGANAA

మంత్రి నకిలీ పియ్యేలు అరెస్ట్

హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)లమని చెప్పుకుంటూ అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి (34 ఏళ్లు), మచ్చ సురేష్ (30 ఏళ్లు) హైదరాబాద్‌లోని నాగోల్‌లో నివసిస్తున్నారు. వీరు మంత్రి పీఏలమని చెప్పుకుంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫోన్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయం మంత్రి దృష్టికి రాగానే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ఈ ఇద్దరు మోసగాళ్లను అరెస్ట్ చేశారు.

ఇకపై తన పీఏలమని ఎవరైనా ఫోన్ చేస్తే, చిన్న అనుమానం కలిగినా సచివాలయంలోని తన కార్యాలయ నంబర్లు 040-23451072 లేదా 040-23451073కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Share this post
Exit mobile version