గౌరవ అధ్యక్షులుగా లక్కర్సు ప్రభాకర్ వర్మ
పెరిక కుల (పురగిరి క్షత్రియ) సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యర్రంశెట్టి ముత్తయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ కుతుబుల్లాపూర్ లో బుధ, గురువారం రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సదస్సులో రాష్ట్ర కో ఆర్డినేటర్లు, వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులు, కుల పెద్దల సమక్షంలో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా లక్కర్స్ ప్రభాకర్ వర్మ, అసోసియేట్ అధ్యక్షులుగా ఆక రాధాకృష్ణ, సాగాని హరికృష్ణ లను, ముఖ్య సలహాదారులుగా రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, సీనియర్ నాయకులు చింతం లక్ష్మీనారాయణలను ఎన్నుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన యర్రంశెట్టి ముత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పెరిక పెద్దలు ఎంతో నమ్మకంతో నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కుల పెద్దలు సూచించిన విధంగా పెరిక కుల ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శక్తికి మించి కృషి చేస్తానని అన్నారు. పెరిక కుల ప్రజలను సామాజికంగా ఆర్థికంగా, వ్యాపారపరంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించి ప్రభుత్వం, కుల పెద్దల సహకారంతో అమలు చేస్తానని అన్నారు. శ్రమలో, ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే పెరిక కుల ప్రజలు రాజకీయాల్లో కూడా స్వయం కృషితో ఎదుగుతున్నారని, విద్య, ఉద్యోగాల్లో కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని, కుల సంఘం నుండి సహకారం, ప్రోత్చాహం అందిస్తే మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. బి.సి ఉద్యమ శకం నడుస్తున్న నేటి రోజుల్లో పెరిక కుల ప్రజలను బి.సి ఉద్యమాల్లో ప్రత్యేక స్థానం కల్పించే దిశగా ముందుకు సాగుదామని అన్నారు.
గతంలో సంఘానికి నాయకత్వం వహించిన వారు ఒంటెద్దు పోకడలతో సంఘాన్ని బ్రస్టు పట్టించారని, వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడి సంఘాన్ని, కుల ప్రజలను అభివృద్ధిని మరిచారని, ప్రశ్నించిన వారిని పక్కకు నెట్టి ఆధిపత్యంతో సంఘాన్ని, సంఘ ఆస్తులను కైవసం చేసుకొని కుల ప్రజలకు నష్టం చేస్తున్నారని అన్నారు. పెరిక కులం అంటే ఒక్క హైదరాబాద్ లోనే లేదని, ఒక్క హైదరాబాద్ లోనే భవనాలు కట్టడంలో ఆంతర్యం ఏమిటని? హైదరాబాద్ నగరంలో ఉన్న సంపన్న పెరిక కులస్తులు కూటమిగా ఏర్పడి రాష్ట్ర సంఘాన్ని కైవసం చేసుకున్న విషయం రాష్ట్రంలోని పెరిక కులస్తులు గమణించారని, అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా కొత్త సంఘాన్ని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. కొత్తగా ఎన్నుకోబడిన సంఘం 33 జిల్లాల్లో పెరిక కుల ఆత్మగౌరవ సంఘాలు నిర్మించి అందులో హాస్టళ్లను నిర్వహించి అందులో రాజకీయ, విద్య శిక్షణలు ఇస్తామని అన్నారు.
అప్రజాస్వామిక కమిటి వైదొలగాలి
రాష్ట్ర, జిల్లా సంఘాలకు ఉన్న ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇటీవల ఎన్నుకోబడిన రాష్ట్ర కమిటి వెంటనే రాజీనామా చేసి వైదొలగాలని కొత్తగా ఎన్నుకోబడిన కమిటి తీర్మానం చేశారని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా నడపాల్సిన కుల సంఘాన్ని రాజకీయ పార్టీలకు తాకట్టు పెడుతున్నారని, గత పార్లమెంటు ఎన్నికల నుండే పెరిక కుల రాష్ట్ర సంఘాన్ని రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టీ వాళ్ల ఇష్టానుతీరుగా ప్రవర్తిస్తూ కులానికి చెడ్డ పేరు తెస్తున్నారని అన్నారు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయడం వల్ల రాష్ట్ర పెరిక కుల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. కుల సంఘంలో ఏనాడు పనిచేయని వారు ఏకంగా పెరిక సంఘం రాష్ట్ర నాయకులుగా ఎన్నుకున్నామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. అప్రజాస్వామికంగా నియమించబడిన కమిటికి రాష్ట్రంలోని కులస్తులు, ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, ఇతర సామాజిక సంఘాలు ఎవరూ గుర్తించకూడదని, సహకరించకూడదని తెలిపారు.
కొత్తగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు యర్రం శెట్టి ముత్తయ్య, వారి కమిటీకి కుల పెద్దలు మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, బొలిశెట్టి రంగారావు, బరుపటి ప్రసాద్, అంకతి ఉమా మహేశ్వర్ రావు, గజ్జెల వెంకన్న, పూజారి వెంకటేశ్వర్లు, చిడెమ్ మోహన్ రావు, బొలుగొట్టు శ్రీనివాస్, కానిగంటి శ్రీనివాస్, డాక్టర్ కౌలయ్య, బోడకుంట్ల సుధాకర్, గంపా నాగరాజు, ధనేకుల కృష్ణ, నట్టే మోహన్ రావు, అంకతి వెంకటరమణ, దిడ్డి మోహన్ రావు, శ్రీరామ్ వీరయ్య, దిడ్డి నరేందర్, సందెసాని నరేష్, శ్రీధర్ల జగదీష్, అప్పని సతీష్, సైదులు తదితరులు అభినందనలు తెలిపారు.

