మంత్రుల మధ్య కానరాని సమన్వయం
సొంత శాఖ సమీక్షలోనే దేవాదాయ మంత్రి…కొండంత దూరం
మేడారంలో పొంగులేటిదే హవా…
స్వయంగా వేంచేసిన సీఎం సలహాదారు “వేం”…
స్థానిక హోదాలో సీతక్క బిజీ…
*వనదేవతల వద్ద తేలని వ్యవహారంపై చర్చ…
అక్కడ జాతర పనుల పర్యవేక్షణ లెక్కలు…
ఇక్కడ ఓరుగల్లులోనే కొండా దంపతుల క్రిస్మస్ వేడుకలు..
మంత్రుల మధ్య దూరం మరింత పెరిగేనా…!?!?
( అచ్యుత రఘునాథ్ – ప్రత్యేక ప్రతినిధి, వరంగల్ )
కీకారణ్యం…!
జనారణ్యం కాబోతోంది…!!
రెండేళ్లకోసారి
మాఘశుద్ధ పౌర్ణమి గడియలు సమీపిస్తున్నాయంటే.. చాలు…!!!
అక్కడ భక్తి పారవశ్యం పొంగి ప్రవహిస్తుంది..!!!!
గిరిజనుల శౌర్య,పరాక్రమాలకు ప్రతీకగానే కాదు…కోరిన కోర్కెలు తీర్చే వన దేవతల రాకతో..అక్కడ ప్రకృతి పులకరించబోయే క్షణాల కోసం ఎదురుచూస్తూ కోట్లాది మంది మమేకమవుతారు.
పక్షుల కిలకిలారావాలు…
ప్రశాంతమైన వాతావరణం…
కాలుష్య కోరలకు.. సుదూరంగా…
కొండ.. కోనల్లో..
కొలువై ఉన్న కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దేవతలుగా ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క- సారలమ్మ జాతరకు ఆ గిరిజన పల్లె “మేడారం” ముస్తాబవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జాతీయ గిరిజన జాతర నిర్వహణకు సర్వ హంగులతో అధికారయంత్రాంగం సమాయత్తమవుతున్న నేపథ్యంలో తెరవెనుక సాగుతున్న ఆధిపత్య ధోరణులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.. ఎవరికి వారే..తమ సత్తా ఏమిటో ప్రదర్శించాలన్న తపన ఈ మేడారం జాతర పనుల శ్రీకారం కు ముందే బహిర్గతం కావడం… స్వయంగా కేబినెట్ మంత్రుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను స్పష్టం చేసింది. వాటిని ఆదిలోనే సరి చేసేందుకు జరిగిన ఉన్నత స్థాయి యత్నాలు సఫలీకృతమైనాయని అంతా భావించారు. అనుకున్నట్టుగానే… పనులు ప్రతిష్టాత్మకంగా..శరవేగంగా పుంజుకున్నాయి..
ఓరుగల్లు లో దేవాదాయ మంత్రి కొండా సురేఖ దంపతులు అధికారికంగా క్రిస్మస్ వేడుకల్లో
అయితే…
తాజాగా…మంగళవారం నాటి పరిణామాలు అందరిలో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.. అంతే కాదు..మంత్రుల మధ్య దూరం పెరిగిందనే భావనకు ఊతమిస్తున్నాయి…ముఖ్యంగా..దేవాదాయ,అటవీ శాఖమంత్రి కొండా సురేఖ ను దూరం పెడుతున్నారని కొందరు… కొండా దంపతులే స్వయంగా దూరం అవుతున్నారని మరికొందరు బహిరంగంగానే వాదనలు వినిపించుకోవడం రాజకీయ వర్గాల్లో రసవత్తర చర్చకు కేంద్ర బిందువయ్యాయి. దీనిని సరిదిద్దేందుకు అపర చాణిక్యుడైన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి వేంచేసి మరీ స్వయంగా నడుం బిగించారని సొంత పార్టీవారే చెవులు కొరుక్కోవడం ఆసక్తికరంగా మారింది.
అయితే ఎవరికి వారుగా కాకుండా సమిష్టి కార్యాచరణతో ముందుకు సాగాలన్న హైకమాండ్ నిర్ణయాలను కూడా ఇక్కడి నేతలు పక్కన పెడుతున్నారనే అపప్రద కొనసాగుతోంది. నేతల ఆధిపత్య ధోరణులవల్లనే పరిస్థితి చే దాటిపోతుందనడానికి “మేడారం” తాజా సంఘటనలను ప్రతీ ఒక్కరు ప్రస్తావిస్తున్నారు…
అసలేం జరిగింది…!?
మంగళవారం మేడారం లో మంత్రుల పర్యటన ఖరారైంది.
దానికి తగినట్టుగానే హెలికాప్టర్ ను సైతం సిద్ధం చేశారు. నేరుగా రాజధాని నుంచి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , సీతక్క మేడారం వచ్చారు. ఇంకా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తో సహా యితర ప్రజా ప్రతినిదులు, ఉన్నతాధికారులంతా మేడారం చేరుకున్నారు. రాజు వెడలె… అన్న చందాన బారీ ఏర్పాట్ల నడుమ ఇంచార్జ్ మంత్రి పొంగులేటి స్వయంగా అన్ని చూసి, క్షేత్రస్థాయిలో సమీక్షలు చేసి మరో రెండు వారాల్లో అన్ని పనులను పూర్తి చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడే అందరి దృష్టి దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ గైర్హాజరు పై పడింది. అప్పుడెప్పుడో… మేడారం జాతర పనుల్లో తమ శాఖకు తెలువకుండానే అన్ని చేస్తున్నారని..కనీసం ఆ శాఖ మంత్రి హోదాలో తమతో కనీసం సంప్రదింపులు జరపడం లేదన్న భావనను కొండా వర్గీయులు బహిరంగంగానే వ్యక్తం చేయడం గందరగోళానికి దారితీసింది. అప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలతో ముందస్తుగానే ప్రభుత్వ శాఖలకు ఆయాపనులు అప్పగించి గుత్తేదారుల రంగప్రవేశాన్ని నిరోధించారన్న చర్చ జోరుగా సాగింది. ఇక్కడ తెర వెనుక మతలబ్ ఎలా ఉన్నా… పనుల కేటాయింపులపై పెద్ద దుమారమే చెలరేగింది.
ఆ తర్వాత అంతా సమసిపోయిందనుకున్న తరుణంలోనే తాజాగా మంత్రి కొండా తో సహా ఆమె అనుయాయులెవరూ మేడారం ku వెళ్ళకపోవడం అందరి దృష్టి లో పడి కొత్త చర్చకు దారి తీసిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
కాగా…
అదే సమయంలో.. మంగళవారం దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ తన భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు తో కలసి తన సొంత నియోజకవర్గం అయిన ఓరుగల్లులో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో నిమగ్నం కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. జిల్లా కలెక్టర్ తో సహా ఉన్నతాధికార గణం తో అధికారికంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకోవడం చర్చనీయాంశమైంది.
అక్కడ మేడారం లో తన శాఖ పరిధిలోని కార్యక్రమాల పరిశీలన, పర్యవేక్షణ, సమీక్షలు వదలి పెట్టి … ఇక్కడే ఉండడం.. అది కూడా సమావేశాల బిజీలోనే నిమగ్నం కావడం విశేషం.
అంతా అయోమయమేనా..!?
ఒకపక్క ఎమ్మెల్యే ల.మధ్య భేదాభిప్రాయాలతో సతమతమవుతున్న హైకమాండ్ తాజాగా మంత్రుల మధ్య పెరుగుతున్న అంతరాలు… ఆధిపత్య పోరును ఏ రీతిలో పరిష్కరిస్తుందోనన్న చర్చ జరుగుతోంది. జిల్లా రాజకీయాలపై ఇంతకుముందు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు “వేం” ఇచ్చే రాజకీయ తాజా నివేదికపైనే తదుపరి నిర్ణయాలు ఉండవచ్చన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

