Site icon MANATELANGANAA

అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం -మంత్రి జూపల్లి కృష్ణారావు

కఠిన చర్యలు తీసుకోండి: మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13:
అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్‌ మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

శనివారం నాంపల్లి అబ్కారీ భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి, ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎస్టిఎఫ్‌, డిటిఎఫ్ అధికారులతో విస్తృతంగా చర్చించారు. అక్రమ, కల్తీ మద్యం, నాటుసారా, గంజాయి, సింథటిక్‌ డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని, వీటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని స్పష్టం చేశారు.

సరిహద్దు రాష్ట్రాల చెక్‌పోస్టులలో నిఘాను పటిష్టం చేయడంతో పాటు గ్రామీణ మార్గాలపై కూడా పర్యవేక్షణ పెంచాలని సూచించారు. కింగ్‌పిన్లను గుర్తించి పీడీ యాక్ట్‌ కింద అరెస్టు చేయాలని అధికారులకు ఆదేశించారు. కేసులు నమోదు చేయడం నుంచి నిందితులకు శిక్ష పడేవరకు నిఘా, వాదనలో శ్రద్ధ పెట్టాలని అన్నారు.

చర్లపల్లి డ్రగ్స్‌ ముడిసరుకు కేసుపై సమీక్షిస్తూ, మహారాష్ట్ర పోలీసుల ఎఫ్ఐఆర్‌, రిమాండ్‌ రిపోర్ట్‌పై వివరాలు కోరారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ 12,000 కోట్లుగా వచ్చిన వార్తలకు ఆధారాలు లేవని, వాస్తవ విలువ 11.95 కోట్లే అని అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలపై తనిఖీలు జరపాలని మంత్రి ఆదేశించారు.

అక్రమ నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, కల్తీ మద్యం, నాటుసారా విక్రయాలను అరికట్టడమే కాకుండా, పట్టుబడిన వాటిని నిబంధనల ప్రకారం వాడకం లేదా ధ్వంసం చేసే మార్గాలను పరిశీలించాలని సూచించారు. ఫంక్షన్‌ హాల్స్‌, ఫార్మ్‌హౌస్‌లలో జరిగే ప్రైవేట్‌ పార్టీలపై అబ్కారీ శాఖ ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.

ఒక లైసెన్స్‌తో ఎక్కువ బార్లను నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన బార్ల లైసెన్సులు రద్దు చేయాలని, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే వారిని వదలబోమని స్పష్టం చేశారు.

సమావేశంలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కమిషనర్ సి.హరి కిరణ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం, అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీతో పాటు జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎస్టిఎఫ్‌, డిటిఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version