Site icon MANATELANGANAA

సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు.. డిప్యూటీ సీఎం హెచ్చరిక


సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కేనని, అయితే ఆ స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, అసత్య ప్రచారం, మహిళలు లేదా మతాలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం చట్టపరంగా నేరమని డిప్యూటీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రజల అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉపయోగపడుతున్న ముఖ్యమైన వేదికగా మారిందన్నారు.

అయితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రాజ్యాంగం కొన్ని పరిమితులను కూడా విధించిందని ఆయన గుర్తు చేశారు. దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ప్రకారం సహేతుకమైన పరిమితులు ఉన్నాయని వివరించారు.

ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, నిర్ణయాలతో విభేదించే స్వేచ్ఛ కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత దూషణలు, డెత్ థ్రెట్స్, ఆధారాలు లేని ఆరోపణలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు పెట్టడం, మత విశ్వాసాలను అవమానించడం, హింసకు ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిలోకి రావని స్పష్టం చేశారు.

గత కొన్నేళ్లుగా ఫేక్ అకౌంట్ల ద్వారా అసభ్య వ్యాఖ్యలు, పరువు నష్టం కలిగించే ప్రచారం, తప్పుడు సమాచారం, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, డెత్ థ్రెట్స్, సమన్వయంతో జరిగే ఆన్‌లైన్ వేధింపులు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలపై అసభ్య పోస్టులు, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వక అవమానకర వ్యాఖ్యలు చేయడం కూడా పెరిగిందన్నారు.

నిర్మాణాత్మక విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు, భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో భాగమేనని, అయితే ద్వేష ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు, సైబర్ వేధింపులు, ఒకరి పరువును దెబ్బతీసే ఉద్దేశంతో చేసే ప్రచారాలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు.

నేరం చేసిన వ్యక్తికి కులం, మతం, రాజకీయ పార్టీ అనే భేదాలు ఉండవని, తప్పు చేసిన తర్వాత వాటి వెనుక దాక్కోవద్దని హెచ్చరించారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, నేరం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు.

సోషల్ మీడియా దుర్వినియోగానికి గురవుతున్న వారి కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్క్రీన్‌షాట్లు, లింకులు, వీడియోలు లేదా ఇతర డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పారు.

ఫేక్ అకౌంట్ల ద్వారా పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారి వివరాలను బాధ్యత గల పౌరులు ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడం ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), సమాచార సాంకేతిక చట్టం-2000తో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం డెత్ థ్రెట్స్, పరువు నష్టం, మత విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, మహిళలపై అవమానకర వ్యాఖ్యలు, ఫేక్ అకౌంట్లు, ఐడెంటిటీ థెఫ్ట్, అసభ్యకర ఎలక్ట్రానిక్ కంటెంట్ వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సోషల్ మీడియాలో జరిగే నేరాలపై వేగంగా స్పందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సైబర్ క్రైమ్ పోలీసులు, ఇతర చట్ట అమలు సంస్థలతో సమన్వయంగా ఈ బృందం పనిచేస్తుందని చెప్పారు.

చట్టవిరుద్ధ పోస్టులు కనిపిస్తే వాటిని ఫార్వర్డ్ చేయకుండా, స్క్రీన్‌షాట్లు, యూఆర్‌ఎల్, తేదీ, సమయం వంటి ఆధారాలను భద్రపరచి అధికారులకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

చివరిగా, ప్రతి ఒక్కరూ తమ భావాలను గౌరవప్రదంగా, బాధ్యతాయుతంగా వ్యక్తం చేయాలని సూచించారు. “మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. కానీ చట్టాన్ని గౌరవిస్తూ, బాధ్యతతో మాట్లాడండి. అయితే చట్టాన్ని ఉల్లంఘిస్తే న్యాయపరమైన పరిణామాలు తప్పవు” అని డిప్యూటీ ముఖ్యమంత్రి హెచ్చరించారు.

Share this post
Exit mobile version