Site icon MANATELANGANAA

ఆ రూపేంటిఅంతటి రాపిడేంటి!?

“””””””””””””””””””””””””””””””
దాశరథి రంగాచార్య
జయంతి..24.08.1928


అక్షరాలకు ఇంత
వేడి ఉందా..
పదాలకు ఇంత వాడి ఉంటదా..
అక్షరాలు పేర్చి
పదాలు కూర్చి..
కవితలు అల్లితే
కుర్చీలు కదుల్తాయా..
సామ్రాజ్యాలు కూలుతాయా!

ఇప్పుడైతే నమ్మలేని నిజాలేమో..
నైజాం కాలం నాటి నిజం..
కుమ్మేయడమే
దాశరథి కలం
నేర్చిన మేనరిజం..!
రూపమేమో సత్సంప్రదాయం
ఉట్టిపడే వారిజం..
భావజాలమేమో ఉవ్వెత్తున
తిరగబడే మార్క్సిజం…!

అవిగవిగో..
దాశరథి నాటిన విప్లవబీజాలు..
నిజానికవి ఎర్రటి అక్షరాలు..
నిప్పు కణికలు..
నిజాముల దాష్టీకం..
ఇంటింటా వెట్టి..
అసహనం..
ఇవన్నీ ఒక పక్క..
మరోవైపు..మతమార్పిడులు..
కదులుతున్న
హిందూ మూలాలు..
ఆపేందుకు..అడ్డుకునేందుకు
ఆర్యసమాజ్ ప్రయాస..
ఇవన్నీ అక్షరీకరించిన దాశరథి..దొరికింది వారధి..
అదే చిల్లరదేవుళ్ళు..
ఆ అక్షరాలే
విప్లవానికి రుధిరాక్షతలు…
విప్లవ శంఖం మోగి..
రక్తంతో తడిసిన నేలపై
తిరుగుబాటు తోటలు
పెరిగితే పూచినవి
మోదుగుపూలు..!

నిజాముపై తిరుగుబాటే
వస్తువు..
రుధిరమే సిరా..
కాంక్షే కదా కలం..
జాగీరే వేదిక..
మొత్తంగా నిజాములే
ప్రతినాయకులు..
జరుగుబాటు కరువై
తిరుగుబాటు చేసిన
ప్రతి తెలంగాణ బిడ్డ
కథానాయకుడే..!

మురికివాడల జీవితాలు…
వాటి చుట్టూ కమ్ముకున్న
ధనరాజకీయాలు…
దగాకోరుల కసి..
బాధితుల రసి..
వెరసి అమృతంగమయ
బాపూ గ్రామస్వరాజ్యం
నిమ్న జాతుల
తిరుగుబాటు
అగ్నికి ఆజ్యం..!

తన వాదాలు..
నాలుగు వేదాలు..
దాశరథి కలం నుంచి
జాలువారిన ఆణిముత్యాలు..
రేపటి దేశాన్ని
కళ్ళ ముందు కట్టిన
రానున్నది ఏది నిజం..!

అలా..అలలా మొదలై..
తరంగమై..కెరటమై…
ఎగసిపడే సాగరమై..
సాగిన కవితా ధోరణి..
దాశరథి రచనల్లో
విప్లవమే అంతర్వాణి..
అది అనంతవాహిని..!

✍️✍️✍️✍️✍️✍️✍️

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286

Share this post
Exit mobile version