Site icon MANATELANGANAA

డిసెంబర్ 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్


ఎర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సి.ఎస్ ఆదేశాలు
హైదరాబాద్, డిసెంబర్ 1:
డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఖచ్చితంగా, లోపం లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సబ్యసాచి ఘోష్, సంజయ్ కుమార్, సి.ఎం.ఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.ఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ, ఈ సమ్మిట్‌లో పాల్గొనే ప్రముఖులకు, దేశ విదేశాల నుంచి రానున్న అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నట్టు తెలిపారు. సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ అన్ని ఏర్పాట్లూ శ్రద్ధగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా భావన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఏర్పాట్లను ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో నిర్వహించనున్న అతిపెద్ద సమ్మిట్ కావడంతో, అన్ని శాఖలు తమ పురోగతి, విజయాలను ఈ వేదికపై ప్రదర్శించనున్నాయని చెప్పారు. ముఖ్యంగా ప్లీనరీలు, గౌరవ ముఖ్యమంత్రితో వన్-టు-వన్ సమావేశాలు, వివిధ సంస్థలతో MoU లు ఈ సమ్మిట్‌లో ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయని తెలిపారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ సంఖ్యలో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు సి.ఎస్ వెల్లడించారు. ఈ సమ్మిట్ డిసెంబర్ 13 వరకు కొనసాగుతుందని, 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌తో ముగుస్తుందని తెలిపారు.

Share this post
Exit mobile version