• తెలంగాణకు కరువు, పేదరికం అనుభవం నాకు తెలుసు.
• కృష్ణా, గోదావరి జలాలపై సభలోనే చర్చకు ప్రతిపక్షాన్ని ఆహ్వానించా.
• ఉమ్మడి రాష్ట్రంలో 490 టీఎంసీలు ఉండగా, 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు.
• పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పునాదులు ఉమ్మడి రాష్ట్రంలోనే పడ్డాయి.
• సభకు రాకుండా వ్యాఖ్యలు చేయడం చట్టసభల పట్ల అవమానం.
తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా జలాల పంపకం, సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపక్ష నేతల వైఖరిపై పై సుదీర్ఘoగా ప్రసంగించారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్పాయింట్ ప్రెసెంటేషన్ అనంతరం జరిగిన చర్చ తర్వాత ముఖ్యమంత్రి అనేక అంశాలను ప్రస్తావించి బి ఆర్ ఎస్ పార్టీ వైఖరి ని తప్పు పట్టారు.
పాలమూరు బిడ్డగా తనకు కరువు, పేదరికం అనుభవం తెలుసునని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సభలో చర్చ జరగాలని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాలపై సభలోనే చర్చకు రావాలని ప్రతిపక్ష నేతలను ఆహ్వానించినా వారు దూరంగా ఉన్నారని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 490 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయింపులున్నాయని, రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 299 టీఎంసీలకే అంగీకరించిందని సీఎం తెలిపారు. 2015, 2016, 2020ల్లో జరిగిన సమావేశాల్లో ఇదే కేటాయింపులను కొనసాగించారని పేర్కొన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు చరిత్రను గుర్తు చేస్తూ, ఈ ప్రాజెక్టుకు పునాదులు ఉమ్మడి రాష్ట్రంలోనే పడ్డాయని, కాంగ్రెస్ నాయకుల కృషి వల్లే సాధ్యమైందని చెప్పారు.
జూరాల నుంచి వరద జలాలతో పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ఆమోదం లభించిందని, తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సోర్స్ మార్చి ఖర్చు పెంచిందని ఆరోపించారు. సభలో చర్చకు రాకుండా బయట మాటలు మాట్లాడటం చట్టసభలను అవమానించడమేనని సీఎం వ్యాఖ్యానించారు.

