నర్సంపేటలో రూ. 532.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గ్రామీణ అభివృద్ధికి 20 వేల కోట్లతో రోడ్లు, తాగునీరు, పాఠశాలలు – సీఎం
వరంగల్/నర్సంపేట, డిసెంబర్ 5:
పేదల సంక్షేమం ప్రభుత్వ పరమ ధ్యేయమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
హెలీపాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డిని రెవెన్యూ, హౌసింగ్, ఐపీఆర్ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క), నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ప్రభుత్వ విప్ రామ చంద్రునాయక్ తదితర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
నర్సంపేటలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం
ముఖ్యమంత్రి మొత్తం రూ. 532.24 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా:
- రూ. 56.40 కోట్లు: నర్సంపేట – నెక్కొండ HCM రహదారి 2L + PS / 4L విస్తరణ
- రూ. 82.56 కోట్లు: హనుమకొండ – నర్సంపేట – మహబూబాబాద్ రహదారి నాలుగు లైన్ల అభివృద్ధి
- రూ. 26 కోట్లు: ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణం
- రూ. 130 కోట్లు: ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు వసతి గృహాలు
- రూ. 200 కోట్లు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
- రూ. 20 కోట్లు: నర్సంపేట పట్టణంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్
- రూ. 17.28 కోట్లు: నర్సంపేట – పాకాల HCM రోడ్డుకు 2L + PS విస్తరణ
ఈ ప్రాజెక్టులు విద్య, వైద్యం, రహదారి వసతులపై నేరుగా ప్రభావం చూపుతాయని సీఎం పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి రోడ్లు – తాగునీరు – పాఠశాలలు
బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా తెలిపారు:
- గ్రామీణ అభివృద్ధికి రూ. 20వేల కోట్లు కేటాయించామని
- రాష్ట్రవ్యాప్తంగా కోటి 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశామని
- 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని
- డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో పేదల ఆకలి సమస్యను పూర్తిగా తీర్చేందుకు ప్రభుత్వం ధృడ సంకల్పంతో పనిచేస్తుందని ఆయన అన్నారు.
మహిళల సాధికారతకు ప్రాధాన్యం
- సౌర విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, RTC బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించారు.
- ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన ఇందిరమ్మ చీరల పంపిణీ కోడ్ ముగిసిన వెంటనే పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
- 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు చీర అందేలా స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.
4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ
వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో నిర్మించిన ఇళ్లను స్మరించుకున్న సీఎం, పేదల గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.
నర్సంపేట నియోజకవర్గానికి రాబోయే ఆర్థిక సంవత్సరం లో మరిన్ని 3500 ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.
ఉద్యోగాల భర్తీపై మాట్లాడుతూ—
60 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
వరంగల్ అభివృద్ధికి
- వరంగల్ – మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణ పనులు మార్చి 31 లోగా ప్రారంభం
- వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్
- ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పీచ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, పేదల కోసం ప్రతి హామీని సీఎం నెరవేరుస్తున్నారని అన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే దిశగా సాగుతోందని తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల పైగా నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
రూ. 200 కోట్ల మోడల్ స్కూల్, రూ. 154 కోట్ల మెడికల్ కాలేజీతో నర్సంపేట విద్య–వైద్య రంగాల్లో ముందుకు సాగుతోందని అన్నారు.
ఎంపీ బలరాం నాయక్
సీఎం ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారని, రాబోయే 15 సంవత్సరాలు కూడా సీఎం పదవిలో ఉంటారని నమ్మకం వ్యక్తం చేశారు.

