కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొడంగల్ బహిరంగసభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్ధికాభివృద్ధి ఆడబిడ్డల సంతోషంపై ఆధారపడి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల గౌరవం, భద్రత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.
ప్రతి పేద తల్లి కళ్లలో ఆనందం కనిపించాలన్న భావంతో సన్నబియ్యం పంపిణీ చేపట్టామని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు రూ. 500 కి అందిస్తున్నామని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, వారిని ఆర్టీసీ బస్సుల యజమానులుగా మార్చామని పేర్కొన్నారు.
ఆర్థిక స్వతంత్ర్యం కోసం సోలార్ ప్లాంట్ల నిర్వహణ మహిళలకు అప్పగించామని తెలిపారు. హైటెక్ సిటీ శిల్పారామంలో మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆడబిడ్డలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునేందుకు అమెజాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేది విద్య మాత్రమేనని పేర్కొన్నారు. అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని అన్నారు. ఏ విద్యార్థి ఆకలితో ఇబ్బంది పడకుండా చూడాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమం అమలులోకి వస్తుందని చెప్పారు.
బిడ్డల గురించి కన్నతల్లి ఆలోచించినట్లు ప్రభుత్వం వారి గురించే ఆలోచిస్తోందని, విద్య, సాగు రంగాలు తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
కొడంగల్‌లో మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు, ఏటీసీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యే తరగని ఆస్తి అని, రాష్ట్రం నలుమూలల నుంచి చదువుల కోసం కొడంగల్‌కు వచ్చేలా ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. 16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు.
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్చందంగా భూములు ఇస్తున్నారని, ప్రాజెక్టును మూడు ఏళ్లలో పూర్తి చేసి కృష్ణా నీటిని కొడంగల్ భూములకు అందిస్తామని చెప్పారు. లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల త్వరలో నెరవేరనుందని, మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమలు కూడా తీసుకొస్తామని తెలిపారు.
సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ప్రతి ఆడబిడ్డకు చేరేలా అధికారులు చూడాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం మరో పది సంవత్సరాలు కొనసాగుతుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని, ఆ అభివృద్ధికి మహిళలు అండగా ఉండాలని కోరుకున్నారు.

