ములుగు జిల్లా, మేడారం:
సమ్మక్క–సారలమ్మ గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణ డిజైన్లను బుధవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు.
“ఇది కేవలం బాధ్యత కాదు, భావోద్వేగంతో కూడిన బాధ్యత” అని ఆయన అన్నారు. గత పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని విమర్శించారు.
“సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతోనే ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డపై నుంచే తెలంగాణ ప్రజలకు పట్టిన చీడ, పీడలను తొలగించేందుకు పాదయాత్ర ప్రారంభించాను” అని గుర్తుచేశారు.
ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని పేర్కొంటూ, వారి సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. “ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా, ఆదివాసీ–గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేస్తున్నాం” అని స్పష్టం చేశారు.
ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, “సీతక్కకు, నాకు ఈ జన్మ ధన్యమైనట్లే. ఆలయ అభివృద్ధికి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆదివాసీలు, పూజారులు, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. రాతి కట్టడాలే చరిత్రకు సాక్ష్యం అవుతాయి కాబట్టి ఆలయ అభివృద్ధి రాతి నిర్మాణాలతోనే జరుగుతుంది” అన్నారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా మహాజాతర నాటికి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. “పగలు, రాత్రి నిర్విరామంగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. స్థానికుల భాగస్వామ్యం తప్పనిసరి. అధికారులందరూ సమ్మక్క సారక్క మాలధారణ చేసినట్టే భక్తితో పనులు చేయాలి” అని ఆదేశించారు.
కేంద్రంపై విమర్శలు గుప్పించిన సీఎం, “కుంభమేళాకు వేల కోట్లు ఇస్తున్న కేంద్రం, ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడంలేదు? జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని, కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాను” అన్నారు.
తరువాత సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి, సమ్మక్క, సారలమ్మ, పగిడిద రాజు గోవిందరాజులను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు ఆయనకు అమ్మవార్ల ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదం అందజేశారు.
ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి గండ్ర సత్య నారాయణ రావు,వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇ.వి. శ్రీనివాస్, ములుగు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.