Site icon MANATELANGANAA

శిల్పకళా వేదికలో గ్రూప్–III అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చిన సి.ఎం.రేవంత్ రెడ్డి

cm revanth reddy

శిల్పకళా వేదికలో గ్రూప్–III అభ్యర్థులకు నియామక పత్రాలు

అన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో నిర్వహించిన ప్రజా పాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గ్రూప్–III లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ ప్రపంచంతో పోటీ పడేలా యువతను తీర్చిదిద్దే విధంగా పలు కార్యక్రమాలు చేపడతామని సీఎం తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కొత్తగా నియమితులైన ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–IIIలో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పరిపాలనలో ప్రక్షాళన జరగాలంటే కొత్తగా చేరిన ఉద్యోగులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

“ఉద్యోగం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఒక భావోద్వేగం కూడా. ఈ భావోద్వేగమే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే గొప్ప బాధ్యతను మీరు స్వీకరిస్తున్నారు” అని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రజలు ఆశించారని, అయితే 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటు నియామకాలు జరగలేదని సీఎం గుర్తు చేశారు. టీఎస్‌పీఎస్సీలో 14 ఏళ్ల పాటు గ్రూప్–I నియామకాలు కూడా చేపట్టలేదని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, గత రెండేళ్లలో మొత్తం 70 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి, గ్రూప్–I నుంచి గ్రూప్–IV వరకు నియామకాలను ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో విద్య అన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ నాణ్యత లోపిస్తున్నదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 16.5 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అర్హత కలిగిన 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

నాణ్యమైన విద్య, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలను యువత అందిపుచ్చుకోలేకపోతున్నదని సీఎం చెప్పారు. గతంలోలాగా భూములు పంచడం సాధ్యం కాదని, పేదలకు జీవితం మార్చే ఆయుధం నాణ్యమైన విద్య ఒక్కటేనని స్పష్టం చేశారు.

2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో దేశం ముందుకెళ్తోందని, తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. ఇప్పుడే ఉద్యోగాల్లో చేరుతున్నవారంతా 2047 నాటికీ ప్రభుత్వ సేవల్లో కొనసాగుతారని అన్నారు.

పేదలు మీ వద్దకు వస్తే, మీ తల్లిదండ్రులు వచ్చినట్లే ఆదరించాలన్నారు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోని ఉద్యోగుల జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తామని సీఎం హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులకు నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తదితర అధికారులు పాల్గొన్నారు.


Share this post
Exit mobile version