Site icon MANATELANGANAA

అసెంబ్లీ లో చర్చ తర్వాత జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల పై నిర్ణయం

హైదరాబాద్, 18:
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ఎన్నికల యంత్రాంగానికి, అధికారులకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ధనసరి అనసూయ సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని శాసనసభలో చర్చించి, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం 12,728 పంచాయతీల్లో 12,702 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ తీర్పును స్వేచ్ఛగా వెల్లడించారని పేర్కొన్నారు.

రెండేళ్ల పాలన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజల ముందుకు వెళ్లిన ప్రజా ప్రభుత్వానికి 7,527 గ్రామ పంచాయతీల్లో (66 శాతం) ప్రజల మద్దతు లభించిందని తెలిపారు. ఈ ఫలితం ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచిందని, సంక్షేమం మరియు అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు రూ.27 వేల కోట్ల మేర సున్నా వడ్డీ రుణాలు, 4.5 లక్షల పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, తొలి ఏడాదిలోనే 61 వేల ఉద్యోగాల భర్తీ, ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం, వందేళ్ల తర్వాత బీసీ కులగణన, పేదలకు నాణ్యమైన విద్య అందించే చర్యలు వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

ఒక ప్రశ్నకు సమాధానంగా, ఆదాయాన్ని పెంచుకుంటూనే వ్యయాన్ని నియంత్రిస్తూ, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా ప్రజల మేలు కోసమే ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయని చెప్పారు.

కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల అంశంపై పూర్తి వివరాలతో శాసనసభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Share this post
Exit mobile version