Site icon MANATELANGANAA

ఓయూ లో సీఎం రేవంత్ రెడ్డి -వెయ్యి కోట్ల తో మాస్టర్ ప్లాన్

• ఉస్మానియా యూనివర్సిటీ మాస్టర్ ప్లాన్, డిజైన్లపై విద్యార్థుల సూచనల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక క్యూఆర్ కోడ్ విడుదల.
• విద్యార్థుల అభిప్రాయాలనే తుది మాస్టర్ ప్లాన్‌కు ఆధారంగా తీసుకోనున్నట్లు యూనివర్శిటీ వెల్లడింపు.
• ఓయూ అభివృద్ధికి రూ.1,000 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాల ప్రణాళికను ప్రకటించిన సీఎం.
వార్తా కథనం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ మరియు డిజైన్ల పై విద్యార్థుల అభిప్రాయాలు సేకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను విడుదల చేశారు. విద్యార్థుల సూచనల ఆధారంగా తుది ప్రణాళికను సిద్ధం చేస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీ కేవలం విద్యాసంస్థ కాదు, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి కేంద్రం, చైతన్యానికి ప్రతీక అని గుర్తుచేశారు.
“ఓయూకి రావాలంటే ధైర్యం కాదు… అభిమానం కావాలి” అని సీఎం వ్యాఖ్యానించారు. గుండెల నిండా అభిమానంతోనే వేయి కోట్ల రూపాయలతో యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కొమురం భీమ్ నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ ఆధిపత్యంపై పోరాటం సాగిందని ఆయన చెప్పారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులే స్వరాష్ట్ర సాధనలో ముందున్నారని గుర్తు చేశారు. “మా యువత భూములు, ఫామ్ హౌసులు అడగలేదు… స్వేచ్ఛ, సామాజిక న్యాయం మాత్రమే అడిగారు” అని అన్నారు.
యూనివర్సిటీని పదేళ్ళుగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారని ఆరోపించిన సీఎం, తన పాలన విద్యా రంగ పునరుద్ధరణపై దృష్టి పెట్టిందని అన్నారు. “విద్య ఒక్కటే వెనుకబాటుతనాన్ని తొలగిస్తుంది,” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి కీలక సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ బోధనా-అబోధనా నియామకాల్లో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని ఆయన మరోసారి హామీ ఇచ్చారు.
విద్యార్థులు రాజకీయ ఉచ్చుల్లో పడొద్దని సూచించిన సీఎం, భవిష్యత్తులో ఓయూ నుంచి డాక్టర్లు, లాయర్లు, ఉన్నతాధికారులు, నాయకులు తయారవాలని ఆకాంక్షించారు.

Share this post
Exit mobile version