బి.పి మండల్ స్ఫూర్తితో రాజకీయ రిజర్వేషన్లు సాధిద్దాం
ఐక్య ఉద్యమాలతోనే బి.సి రాజ్యాధికారం
బి.సి ఇంటలెక్చువల్స్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు.
వేల ఏండ్లుగా భారతదేశ సమాజ అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేసిన బి.సి ల హక్కులు, అధికారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని, మహానీయులు బి.పి మండల్ స్ఫూర్తితో పోరాడి రాజకీయ రిజర్వేషన్లు సాధించాలని బి.సి ఇంటలెక్చువల్స్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు.
బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 107వ జయంతి సందర్భంగా సామాజికన్యాయం - రాజకీయ పార్టీలు అనే అంశంపై హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో సోమవారం ఇంటలెక్చువల్స్ ఫోరం ఆద్వర్యంలో మండల పరుశరాములు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమం మొదలు దేశంలో జరిగిన ఎన్నో ఉద్యమాల్లో బి.సి లు పాల్గొన్నారని, ఐక్య ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమైందని, పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఐక్య ఉద్యమాలు చేసిన నాడే బి.సి లకు సామాజికన్యాయం జరుగుతుందని అన్నారు. బి.సి సమాజం నుండి ఎదిగిన వారు బి.సి హక్కుల కోసం త్యాగపూరిత ఉద్యమాలు చేయాల్సిన అవసరముందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి మహాసేన రాష్ట్ర కో కన్వీనర్ గొల్లపల్లి వీరస్వామి మాట్లాడుతూ బి.సి హక్కుల కోసం, నైతిక విలువలతో కూడిన పాలనతో పాటు ఎన్నో ఉద్యమాలు చేసిన బి.సి కమీషన్ బాధ్యులు బి.పి మండల్ బి.సి ల అభ్యున్నతి కోసం దేశమంతా పర్యటించి బి.సి లపై సమగ్ర నివేదికను అందించారని, ఆయన సూచించిన 40 అంశాల్లో ఒక్కటైన విద్య, ఉద్యోగాల్లో బి.సి రిజర్వేషన్లను అమలు చేయడం నేటికి పరిపూర్ణంగా జరగలేదని అన్నారు. మండల్ త్యాగనిరతిని ఆదర్శంగా తీసుకొని మండల్ నివేదిక అమలు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ రాజ్యాంగంలో బి.సి ల అభ్యున్నతికి, హక్కుల కోసం 340 ఆర్టికల్ పొందుపరచారని, ఆ ఆర్టికల్ ప్రకారం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగబద్ధమైన కమీషన్ వేసి, ఆ నివేదిక ద్వారా బి.సి ల అభివృద్ధి చేయాలని ఉన్నప్పటికీ నేటికి ఆ ప్రక్రియ కొనసాగడం లేదని అన్నారు. కాకా కలేల్కర్ కమీషన్ మొదలు కామారెడ్డి డిక్లరేషన్ వరకు ఆయా కమీషన్ లు సమర్పించిన నివేదికలను అమలుపరచకపోవడం పాలకుల దుర్మార్గానికి నిదర్శనమని అన్నారు. ఇంతవరకు ఉత్పత్తి శక్తిగా ఉన్న బి.సి శక్తిని రాజకీయ శక్తిగా మార్చి రాజ్యాధికారం చేపట్టిన నాడే బి.సి ల అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ బి.సి లకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారని అన్నారు. 10 ఏండ్ల తన పాలనలో బి.సి లకు తీరని అన్యాయం చేసిన బిఆర్ఎస్ నేడు బి.సి ల కోసం మొసలి కన్నీరు కారుస్తుందని, కవిత లాంటి వాళ్ళను ముందు పెట్టి బి.సి లను మభ్యపెడుతున్న బిఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ముస్లిం బి.సి ల పేరుతో బి.సి రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బిజెపి ని తెలంగాణ బి.సి ప్రజలు ఎన్నికల్లో ఓడించాలని అన్నారు. అట్టహాసంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి, సామాజికన్యాయమే మా పార్టీ ప్రధాన ఎజెండా అని చెపుతున్న కాంగ్రెస్ బి.సి రిజర్వేషన్ల విషయంలో తాత్సారం చేస్తుందని, కామారెడ్డి డిక్లరేషన్ లోని మిగతా విషయాల అమలు ఊసే లేదని అన్నారు. బి.సి రిజర్వేషన్లకు అడ్డుపడే పార్టీలను ఓడిస్తామని బి సి నాయకత్వం ప్రకటిస్తేనే రాజకీయ పార్టీలు భయపడతారని అన్నారు.
ఈ కార్యక్రమానికి బి.సి ఇంటలెక్చువల్స్ ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ కొంగ వీరాస్వామి స్వాగతోపన్యాసం చేయగా వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ కుమార్, న్యాయవాదులు చిల్లా రాజేంద్రప్రసాద్, కొండబత్తుల రమేష్ బాబు, తీగల జీవన్ గౌడ్, ఎగ్గడి సుందర్ రామ్, రాచకొండ ప్రవీణ్ కుమార్, జన్ను పద్మ, జి ఆర్ శ్రీనివాస్, అడ్లూరి పద్మ, వివిధ సంఘాల నాయకులు సోమ రామమూర్తి, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, సాంబారి సమ్మారావు, చందా మల్లయ్య, తాడిశెట్టి క్రాంతికుమార్, చాపర్తి కుమార్ గాడ్గే, సతీష్, పద్మజాదేవి, తమ్మల శోభారాణి, తిరునగరి శేషు, సింగారపు అరుణ, తాడూరి మోహన్, వల్లాల జగన్, ఎర్రంగారి వీరన్ కుమార్, కొడెపాక దేవిక, సిద్ధిరాజు యాదవ్, గైనేని రాజన్, సారిక, మౌనిక తదితరులు పాల్గొని బి.పి మండల్ పూలు సమర్పించి నివాళులు అర్పించారు.