Site icon MANATELANGANAA

భారత రత్న కర్పూరి ఠాకూర్ కు ఘన నివాళి

భారత రత్న కర్పూర్తి ఠాకూర్ స్పూర్తితో బి.సి రాజ్యాధికారం

తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలోనే బి.సి లను చైతన్యం చేసి రాజ్యాధికారం చేపట్టిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి భారత రత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ స్పూర్తితో దేశంలో బి.సి లు రాజ్యాధికార పోరాటం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ పిలుపునిచ్చారు. భారత రత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ 38వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించి జైలుకు వెళ్లిన ఠాకూర్ స్వాతంత్రానంతరం ఆధిపత్య రాజకీయాలు దేశ ప్రజలను పీడిస్తున్న కాలంలో తిరుగుబాటు చేసిన వారిలో ముఖ్యులని, బి.సి వాదం, అత్యంత వెనుకబడిన బి.సి ల అభివృద్ధికి పాటుపడిన ఠాకూర్ నేటి బహుజన సమాజానికి స్ఫూర్తి కావాలని అన్నారు. ఆధిపత్య రాజకీయాలను తలదన్ని కాంగ్రెసేతర మొదటి సోషలిస్ట్ ముఖ్యమంత్రిగా 1970 లోనే పదవి చేపట్టి 1990 లో బి.పి మండల్ సిఫార్సుల అమలులో కీలకపాత్ర పోషించారని అన్నారు. 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి మహాసేన రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ సామాజికన్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం చేసిన సేవలకు భారత రత్న అవార్డు అందుకున్న కర్పూరి ఠాకూర్ స్పూర్తితో బి.సి లు చైతన్యం చెందాలని, రాజ్యాధికారం కోసం కుల, మతాలకు అతీతంగా ఐక్యం కావాలని అన్నారు. బి.సి ల ఓట్లను కాజేయడానికి దేశంలో ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ ప్రలోభ రాజకీయాలు చేస్తున్నారని, బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్, జనగణలో కులగణన చేస్తామని బిజెపి బి.సి లను మోసం చేశారని అన్నారు. బి.సి లు రాజకీయ చైతన్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు సాగితేనే విముక్తి సాధ్యమని అన్నారు. 
ఈ కార్యక్రమంలో వి.సి.కె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, బి.ఎల్.ఎఫ్ జిల్లా నాయకులు ఐతం నగేష్,  న్యాయవాదులు అంజలి, సౌందర్య, వివిధ సంఘాల నాయకులు తాడూరి మోహన్, సింగారపు అరుణ, పోతరాజు లక్ష్మీనారాయణ, కొడిపాక దేవిక, అనిశెట్టి సాయితేజ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Share this post
Exit mobile version