Site icon MANATELANGANAA

ములుగు పర్యాటకంలో అటవి అందాల వ్యూవ్ పాయింట్

view

ములుగు జిల్లా పచ్చని అడవి అందాలు పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి: మంత్రి సీతక్క

ములుగు జిల్లా పచ్చని అడవి అందాలతో పర్యాటకులను ఆకర్షించే కేంద్రంగా మారుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని కలుషిత వాతావరణానికి దూరంగా, కుటుంబ సమేతంగా ప్రకృతి ఒడిలో ఆనందంగా, ఆరోగ్యకరంగా గడిపే అవకాశం ములుగు జిల్లా అందిస్తోందని ఆమె పేర్కొన్నారు.

శనివారం తాడ్వాయి మండలం జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ములుగు జిల్లాలోని బొగత జలపాతం ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. గత సంవత్సరం పస్రా–తాడ్వాయి మధ్య జలగలంచ వాగు వద్ద ‘బ్లాక్ బెర్రీ ఐలాండ్’ను ప్రారంభించామని, ఇటీవల తాడ్వాయి హట్స్ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో సఫారీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇప్పుడున్న ఈ కొత్త వ్యూ పాయింట్ ద్వారా ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ములుగు అడవి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయని మంత్రి అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి ములుగు జిల్లా ప్రకృతి అందాలు సిద్ధంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని, చిన్నా పెద్దా అందరూ కలిసి ఆనందంగా పతంగులు ఎగురవేస్తారని చెప్పారు. పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

అయితే చైనీస్ మాంజా దారాల వాడకం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారాలు మనుషులకే కాకుండా పక్షులకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలంతా చైనీస్ మాంజా దారాలను వాడకూడదని, స్వచ్ఛందంగా వాటిని పూర్తిగా నిషేధించాలని మంత్రి పిలుపునిచ్చారు. సురక్షితమైన పతంగి దారాలను మాత్రమే వినియోగిస్తూ, పండుగను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version