అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు
మానవీయ విలువల సమాజ నిర్మాణంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పద్మశ్రీ డాక్టర్ అందెశ్రీ మరణం తెలంగాణతో పాటు దేశంలోని పీడిత ప్రజలకు తీరని లోటని హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ అన్నారు. అందెశ్రీ అకాల మరణంతో సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లా కోర్టుల విధులు బహిష్కరించి సర్దార్ వల్లభాయి పటేల్ హాల్ లో హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన నివాళి సభలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిముషాలు మౌనం వహించి నివాళులు అర్పించి మాట్లాడారు. కనీస అక్షర జ్ఞానం లేకున్నప్పటికీ ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తూ సామాజిక స్పృహతో పీడిత ప్రజల కష్టాలపై, పాలకుల దోపిడీపై, తెలంగాణ అణచివేతపై ఎన్నో ఉత్తేజపూరిత పాటలు వ్రాసి, పాడిన మహా కవి అందెశ్రీ బాటలో తెలంగాణ సమాజం పయనించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్ధన్, బైరపాక జయాకర్, మాజీ బార్ కౌన్సిల్ సభ్యులు ముద్దసాని సహోదర రెడ్డి, హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కొత్త రవి, ఉపాధ్యక్షులు మైదం జయపాల్, ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్, సీనియర్ న్యాయవాదులు చిల్ల రాజేంద్రప్రసాద్, గుడిమల్ల రవి, తీగల జీవన్ గౌడ్, నబి, సత్యపాల్, నల్ల మహాత్మా, బత్తిని రమేష్ గౌడ్, గంధం శివ, వేముల రమేష్ లు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన ఆయన మాట, పాట తూటాల్లాగా పని చేశాయని, అందెశ్రీ రచించి పాడిన జయజయహే తెలంగాణ జననీ జయకేతనం గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా కొనసాగడం అందెశ్రీకి గర్వకారణమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత తపించి పాడాడో అంతకన్నా ఎక్కువగా తెలంగాణలో కెసిఆర్ దుష్ట పాలన అంతం కోసం శ్రమించాడని వారన్నారు. మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు అని పాడి మానవీయ విలువల సమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాటం చేశాడని అన్నారు. అందెశ్రీ లాంటి మహనీయుల పోరాటం, త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణలో లబ్ధి పొందుతున్న వారు తెలంగాణ సమాజ అభివృద్ధికి కోసం పాటుపడాలని, ఆయన చూపిన బాటలో పయనించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళని అన్నారు. నివాళి సభ అనంతరం కోర్టు హాల్ నుండి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లి అమరవీరుల స్థూపం వద్ద అమర్ రహే అందెశ్రీ అని నినదించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఆనంద్ మోహన్, ఇజ్జగిరి సురేష్, పశుపతి ఈశ్వర్ నాథ్, రామగోని నర్సింగరావు, యాకస్వామి, వోడపల్లి శ్యామ్ కృష్ణ, సునీల్ కుమార్, కానూరు రంజిత్ గౌడ్, కుమార్, శ్రీధర్, జి ఆర్ శ్రీనివాస్, పూసపల్లి శ్రీనివాస్, ఎగ్గడి సుందర్ రామ్, చిరంజీవి, వలిఉల్లా ఖాద్రీ, ఇజ్జగిరి చంద్రశేఖర్, తాళ్ళపెలి మధూకర్, తండమల్ల శ్రీనివాస్, రాహుల్, కొండయ్య, స్వర్ణలత, అంజలి, వేణు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

