Site icon MANATELANGANAA

ములుగు జిల్లాలో ప్రాచీన సమాధుల ప్రాంతాలు సందర్శించిన హెరిటేజ్ అధికారులు


ములుగు: స్థానికులు అందించిన సమాచారం మేరకు ప్రాచీన సమాధులు గల అటవీ ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్ శాఖ అధికారులు సందర్శించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆదేశాల మేరకు ఈ పర్యటన జరిగింది.

డైరెక్టర్ ఆచార్య అర్జున్ రావు, డిప్యూటీ డైరెక్టర్ డా. పి. నాగరాజు, ఓఎస్డీ ఎ. రాజు ఆధ్వర్యంలో టెక్నికల్ బృందం పరిశీలనలు చేపట్టింది.


ఈ సందర్భంగా పాతరాతి యుగానికి చెందిన ప్రాచీన మానవ సమాధులను బృందం గుర్తించింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ సమాధులు ఆ కాలం మానవుల జీవన విధానం, వృత్తులు, సామాజిక వ్యవస్థపై సమాచారం అందించే అవకాశముందని అధికారులు తెలిపారు.


వరంగల్ నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలం మొట్లగూడెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఈ సమాధులు సుమారు 100 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. స్థానికులు వీటిని “రాక్షస బండలు”, “రాక్షస గుహలు” అని పిలుస్తున్నారు.
కాలక్రమేణా కొన్ని సమాధులు దెబ్బతిన్నాయి. మరికొన్ని సమాధుల రాళ్లను స్థానికులు ఇళ్ల నిర్మాణానికి వినియోగించారు. కొన్ని చోట్ల సమాధుల్లోని రాతి తొట్లను పశువులకు నీటి కోసం ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలు అడవులుగా మారి, అడవి జంతువుల నివాసంగా ఉన్నాయి.
ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలోని దామరవాయి, జగ్గారం, గంగారం, రంగాపురం, కామారం, మంగపేట మండలంలోని మల్లూరు గుట్ట, మొట్లగూడెం, కొమురారం, చెట్టుపల్లి, కాంచనపల్లి, గలభ, దొంగతోగు, గుండాల వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమాధులు గుర్తించబడ్డాయి.
కప్పలయ గుట్టపై ఉన్న సమాధులు నిర్మాణంలో నైపుణ్యం కనిపిస్తుంది. 4 నుంచి 25 మీటర్ల వరకు విస్తీర్ణంలో ఉన్న ఈ డాల్మెన్ సమాధులు పెద్ద రాళ్లతో నిర్మించబడ్డాయి. నాలుగు రాళ్లను నిలబెట్టి, వాటిపై పెద్ద రాతి పలకను కప్పుగా ఉంచారు. లోపల చిన్న రాతి గది ఉంటుంది. సమాధి చుట్టూ రాళ్లతో ప్రహరీలా నిర్మాణం చేశారు.
ఒక్కో సమాధి మధ్య 5 నుంచి 100 అడుగుల దూరం ఉండటం గమనార్హం. ఇది ప్రణాళిక ప్రకారం నిర్మించినట్టుగా కనిపిస్తుంది. సమాధులపై ఉన్న రాళ్లు సుమారు 10 నుంచి 20 టన్నుల బరువు ఉంటాయని అంచనా. కప్పలయ గుట్ట ప్రాంతంలో ఇవి సుమారు 100 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. ఇది దేశంలోనే పెద్ద డాల్మెన్ సమాధుల సముదాయాలలో ఒకటిగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ నిర్మాణాలు మరణానంతర జీవితం పై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో ఇటువంటి సమాధులు కనిపిస్తాయి.
తెలంగాణలో ఇలాంటి వారసత్వ నిర్మాణాలు ఉండటం ముఖ్యమని అధికారులు తెలిపారు.
ఈ పర్యటనలో డా. పి. నాగరాజు, ఎ. రాజు, టి. సాంబశివరావు, పి. క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

Share this post
Exit mobile version