Site icon MANATELANGANAA

ఏఐ ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటుకు ఆస్ట్రేలియాతో కీలక ఒప్పందం: ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు


ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం నాడు కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే ఈ తరహా నైపుణ్య శిక్షణ కేంద్రం (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) మొట్టమొదటిది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా మంత్రి జూలియన్ హిల్ తో కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల బాబు ఎంఓయు వివరాలను వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను నెలకొల్పనున్నట్టు శ్రీధర్ బాబు తెలిపారు. డీకిన్ అప్లయిడ్ ఆర్టిఫిషియల్ ఇన్ స్టిట్యూట్ ఈ ఎక్సెలెన్స్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తుందని ఆయన వివరించారు. కాలేజిల నుంచి అకడమిక్ గ్రాడ్యుయేట్లను కాకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో కూడిన ప్రతిభావంతులను తయారు చేయాలన్న లక్ష్యంతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకురావడానికి సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఒప్పందం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాలన, ఆరోగ్యం, విద్య, ఐటీ, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ రంగాల్లో పరిశోధన, నైఫుణ్య శిక్షణ అందజేయడానికి ఈ సెంటర్ ఎక్స్ లెన్స్ ఉపయోగపడుతుంది. డిజిటల్ ఇండియా భవిష్యత్తుకు తెలంగాణా ముఖ ద్వారం కానుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
“రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో కూడా నైపుణ్య శిక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాను సందర్శించిన సందర్భంగా డీకిన్ యూనివర్సిటీని రాష్ట్రంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాం. తెలంగాణాలో నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన ఎకోసిస్టం ఉంది. దీనికి ఈ ఎక్స్ లెన్స్ సెంటర్ సేవలు మరింత ఉపయోగపడతాయి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వృత్తి నిపుణులకు తమ దేశంలో ఉన్నత స్థాయి నైపుణ్యాల్లో శిక్షణ అందించడానికి కూడా ఆస్ట్రేలియా అంగీకరించింది”.
ఎంఓయు కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు ఐ. సాయిక్రిష్ణ, ఆస్ట్రేలియా ప్రతినిధులు క్యామ్ గ్రీన్, కరేన్ సాండర్ కాక్, నథానియెల్ వెబ్, స్టీవెన్ బిడిల్, హిల్లరీ మెక్ గీచి, స్టీవెన్ కానోలీ, విక్రం సింగ్, ఐటీ శాఖ చీఫ్ స్ట్రాటెజిస్ట్ శ్రీకాంత్ లంకా తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version