Site icon MANATELANGANAA

రైతు బీమా డబ్బుల కోసం లంచం డిమాండ్ చేసిన ఏఈఓ -చివరికి కటకటాలకు

acb

మహబూబాబాద్ జిల్లాలో అవినీతి మరోసారి బయటపడింది. రైతులకు అండగా నిలవాల్సిన ఓ వ్యవసాయ అధికారి, మరణించిన రైతు కుటుంబాన్ని సైతం వదలకుండా లంచం కోసం వేధించాడు. చివరికి ఎసిబికి పట్టుబడి కటకటాల పాలయ్యాడు.

మరిపెడ మండలం అనేపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14న మరణించారు. ఆయన కుమారుడు, ప్రభుత్వ రైతు బీమా పథకంలో భాగంగా ఆర్థిక సాయం పొందేందుకు అవసరమైన పత్రాలను మరిపెడ వ్యవసాయ కార్యాలయంలో సమర్పించాడు.

అయితే అనేపురం క్లస్టర్‌ ఏఈఓ (అసిస్టెంట్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్) గాడిపెళ్లి సందీప్, ఆ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి రూ.20,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇవ్వలేనని రైతు కుమారుడు వేడుకున్నా ఆయన వెనక్కి తగ్గలేదు. చివరికి ఇద్దరి మధ్య రూ.10,000కు ఒప్పందం కుదిరింది.

ఈ విషయం అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి తేవడంతో వల పన్ని, లంచం తీసుకుంటుండగా ఏఈఓ సందీప్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.సందీప్ ఇంట్లో కూడఎసిబి అధికారులు సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరంమెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్ చేశారు.

రైతు కుటుంబాన్ని దోచుకోవడానికి వెనుకాడని ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంక్షేమ పథకాలపై అధికారుల అవినీతి పట్ల జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Share this post
Exit mobile version