జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై సమాలోచన అవసరం – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
అక్రిడేషన్ల జారీ జీవో–252 సవరణకు తక్షణ చర్యలు తీసుకుంటాం
ఖమ్మం, డిసెంబర్ 28:
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంలో ప్రభుత్వం సుదీర్ఘంగా సమాలోచన చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అర్బన్ లిమిట్‌లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం లేదని, అయితే బిలో పవర్టీ లైన్ కింద ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం పరిశీలన చేపడుతుందని తెలిపారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం ఆదివారం డిప్యూటీ సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అక్రిడేషన్ల కార్డుల జారీకి సంబంధించిన జీవో–252ను సవరించాలని, గతంలో మాదిరిగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులకు ఒకే విధమైన అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, కార్డుల సంఖ్యపై కోత విధించే నిబంధనలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల పంపిణీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ వినతికి స్పందించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అక్రిడేషన్ల జారీ విషయంలో జర్నలిస్టులకు ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకొని జీవో–252ను సవరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీవో వల్ల జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని భావిస్తే దాన్ని సరిదిద్ది ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
ఇళ్ల స్థలాల అంశంపై మాట్లాడుతూ, ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని అంశాలను క్రోడీకరించి, సొసైటీ ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రతిపాదనపై న్యాయ నిపుణులతో మరింత విస్తృత చర్చ అవసరమని పేర్కొన్నారు. బిలో పవర్టీ లైన్ కింద ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, వనం నాగయ్య, ప్రశాంత్ రెడ్డి, దుంపల భాస్కర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు రామకృష్ణ, శెట్టి రజినీకాంత్, కె. హరీష్, మందుల ఉపేందర్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, అలాగే కళ్యాణ్, సాయి, పానకాలరావు, జీవన్ రెడ్డి, ఉల్లోజు రమేష్, పెంటి వెంకటేశ్వర్లు, సాక్షి నాగేందర్, నల్లమోతు శ్రీనివాస్, వి5 యాదగిరి, ఇసంపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

