Site icon MANATELANGANAA

ఓ అక్రిడేషన్..అందని మావి..ఎండమావి..!

ఓ అక్రిడేషన్..
అందని మావి..
ఎండమావి..!

ఇంతా చేసి అదేం
నోబుల్ బహుమతా ఏంటి..
అన్నం పెట్టే అక్షయ పాత్రా..
గొప్ప బిరుదా..
అరుదైన సత్కారమా…!
ఓ కార్డు..
అదో పెద్ద రివార్డా…
ప్రతిభను మెచ్చి
ఇచ్చే అవార్డా..
పోనీ జీవితం మొత్తానికి పనికొచ్చేదా
ఏడాది తిరిగేసరికి
చెల్లని చీటీ
జర్నలిస్టు బ్రతుకులాగే
చెల్లుబాటు కాని ఓ చెక్కు
దినదినం ఓ చిక్కు..

పండగొస్తే అందరి ఇళ్లలో
ఏదో ఒక సందడి..
పాత్రికేయులకు
అక్రిడేషన్ గడబిడ..
కలం వీరుల
గుండెల్లో కలకలం..

ఏడాదికోసారి సర్కార్
ఇచ్చే ఆ కార్డు
జర్నలిస్టుకు ఓ పరువు
ఈసారి రావడమే
బరువు..గుండె చెరువు

ప్రభుత్వం పంచే శతకోటి ఉచితాల్లో ఇదొక్కటేనా
అనుచితం!?
ఆధార్..తెల్లకార్డు..
డ్రైవింగ్ లైసెన్స్..
స్కూల్లో చదువు..
ఏదో ఒకటి ఉంటే
జనాలకి పందేరం
వెనక పాతికేళ్ల
అనుభవాన్ని చూపినా రాదే
అక్రిడేషన్ సంబరం..

ఉచితాలు అందుకుని
గూట్లో గువ్వలా జనాలు..
ఇంట్లో బువ్వ లేక
చేతిలో బుక్కు..
చంకలో కెమెరాతో
రోడ్డు మీద జర్నలిస్టులు..

ఎండనక..వాననక..
ఆపై పగలనక..రేయనక..
కడుపులో ప్రేగులు నకనక
పెళ్ళాం బియ్యం
తెమ్మంటే ఆనక అనలేక..
ఆమె పిలుస్తున్నా యోగిలా..
పెద్ద త్యాగిలా
వార్తల కోసం యధావిధిగా
ఊరు మీద పడి
రేషన్ ఒట్టుకెళ్ళకపోయినా
రాత్రి పొద్దుపోయాక
ఇంటికి వెళ్ళి పెళ్ళాంపిల్లలకి
మొహమెలా
చూపించాలని టెన్షన్..
ఇదే విలేఖరి బ్రతుకు అటెన్షన్..!

యాజమాన్యం ఎటూ ఇవ్వదు
సరిపడా భత్యం..
ఇది నిత్య సత్యం..
వార్త రాసేటప్పుడు
ఆణిముత్యం..
డబ్బుల కోసం పెళ్ళాం
నిలదీస్తే మాత్రం స్వాతిముత్యం
ఈ ఉద్దోగమొద్దురా అని అనుభవం గల పెద్దోళ్ళు సెప్పినా పట్టించుకోని
అదో రకం పైత్యం..

ఇన్ని కష్టాల నడిమి
ఒకే ఒక్క ఇష్టం
సర్కారిచ్చే కార్డు ముక్క
అదేం జీవితాన్ని
ఉద్ధరించే తురుపు ముక్కా
గట్టిగా చెప్పాలంటే
తుమ్మితే ఊడిపోయే ముక్కు..
వస్తుందేమో బస్సు పాసు
అందులోనూ
బోలెడంత తిరకాసు..
స్టేట్..జిల్లా అంటూ తేడా
అవి పట్టుకుని తిరిగేస్తారా
పనిలేక ఊరూవాడా..
పనుంటేనేగా ఊరికి..
వెళ్తారా ఎక్కడికైనా ఊరికే..
పాసుకు తప్పించి దేనికీ కొరగాని కార్డుకు
బోలెడంత రికార్డు..
తెగ్గొట్టడానికి కమిటీలు..
ఎక్కడ లోపం దొరుకుద్దా
అని వెతికేస్తూ
పట్టుకుని దివిటీలు..
కార్డు కోసం అవసరమా ఆందోళనలు..
ఈ పనికిరాని ప్రక్షాళనలు..
ఇప్పటికైనా ఇస్తే సంతోషం..
లేదంటారా..
జర్నలిస్టుల సమస్యలు ఎప్పటికీ సశేషం..
అలవాటైనవే కష్టాలు…
బ్రతుకులెటూ నికృష్ఠాలు..!?

(కార్డు రాని
రికార్డు మూటకట్టుకునే
ప్రతి జర్నలిస్టుకు అంకితం..)

✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286

Share this post
Exit mobile version