నిజామాబాద్, సెప్టెంబర్ 21: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ.15 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఏసీబీ విడుదల చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం, ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పాల్దా అశోక్, ఆడిట్ విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కలకుంట్ల కిరణ్ కుమార్ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఫిర్యాదుదారుడి తల్లి నెలవారీ పెన్షన్ మంజూరుకు సంబంధించిన సర్వీస్ బుక్‌లో అవసరమైన ఎంట్రీలు చేయడంతో పాటు ఇన్‌క్రిమెంట్ ప్రొసీడింగ్స్ సిద్ధం చేసి ఇవ్వడానికి రూ.15,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 21న ఉదయం 11.18 గంటల సమయంలో, నిజామాబాద్ పట్టణంలోని సీతారామనగర్ కాలనీలో రాజా రాజేంద్ర చౌరస్తా సమీపంలోని పద్మశాలి సంఘం వద్ద ఏసీబీ నిజామాబాద్ రేంజ్ అధికారులు ట్రాప్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిందితులు లంచం స్వీకరిస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ తెలిపింది.
ప్రభుత్వ విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమంగా ప్రయోజనం పొందినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఏసీబీ, ఇద్దరినీ అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని II అదనపు ప్రత్యేక న్యాయస్థానం (SPE & ACB కేసులు) ఎదుట హాజరుపరచనున్నట్లు వెల్లడించింది.
ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

