Site icon MANATELANGANAA

అక్రమాస్తుల కేసులో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌ అరెస్టు

acb case

ఆశ్చర్య గొలిపే అక్రమాస్తులు

రూ.12.72 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు – బహిరంగ మార్కెట్‌లో వందల కోట్ల విలువ

హైదరాబాద్‌: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) భారీ వల వేసింది. అక్రమార్జన ఆరోపణలపై రవాణాశాఖ మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీటీసీ) మూడ్‌ కిషన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కిషన్‌కు సంబంధించిన ఇల్లు, బంధువులు–సన్నిహితుల ఆస్తులపై రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించారు. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఈ మొత్తం లభించగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ వందల కోట్లకు చేరుతుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

సికింద్రాబాద్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లి రాజరాజేశ్వరి నగర్‌లోని కిషన్‌ నివాసంతో పాటు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌–2 డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలో బృందాలు సోదాలు చేపట్టాయి. నగదు, బంగారు ఆభరణాలు, అక్రమాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.

సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు బోయిన్‌పల్లిలోని కిషన్‌ ఇంటికి చేరుకోగా, ఆయన కొంతసేపు స్నానాల గదిలోనే ఉండిపోయినట్లు సమాచారం. అనంతరం సోదాలు ప్రారంభించగా ఆస్తుల పత్రాలు కనిపించకపోవడంతో అధికారులు లోతుగా విచారించారు. కిషన్‌ సెల్‌ఫోన్‌లో బంగారు ఆభరణాలకు సంబంధించిన పత్రం లభ్యమవడంతో, సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని ఓ దుకాణానికి సంబంధించి విచారణ జరిపారు. ముందు రోజు ఆభరణాలను అక్కడికి అప్పగించినట్లు వ్యాపారి వెల్లడించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆస్తుల పత్రాలను ఓ బంధువు ఇంట్లో దాచినట్లు తేలడంతో అక్కడి నుంచి కూడా పత్రాలు సేకరించారు.

1994లో అసిస్టెంట్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా రవాణాశాఖలో సేవలు ప్రారంభించిన కిషన్‌పై తొలి నుంచే ఆరోపణలున్నాయని ఏసీబీ తెలిపింది. బోధన్‌లో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా, మద్నూర్‌ చెక్‌పోస్ట్‌ పర్యవేక్షణ బాధ్యతల్లో పనిచేశారు. నిజామాబాద్‌లోనూ ఎంవీఐగా విధులు నిర్వర్తించారు. తాజా సోదాల్లో నిజామాబాద్‌లోనూ అక్రమాస్తులు వెలుగులోకి రావడంతో, ప్రారంభ దశ నుంచే ఆస్తులు కూడబెట్టినట్లు స్పష్టమైంది. అనంతరం మేడ్చల్‌, మెహిదీపట్నం ఆర్టీవోలుగా పనిచేసి పదోన్నతి పొందిన కిషన్‌.. ఏడాది క్రితమే మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

సోదాలు ముగిసిన అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు, ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపర్చి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Share this post
Exit mobile version