యూరియా సరఫరాకు లంచం డిమాండ్
వనపర్తి జిల్లాలో లంచం తీసుకుంటూ జిల్లా వ్యవసాయ అధికారి తెలంగాణ అవినీతినిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారునికి ఎలాంటి అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా ఎరువు (యూరియా) సరఫరా చేయడానికి గాను రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో ముందుగా రూ.3,000 లంచంగా స్వీకరించిన అధికారి, మిగిలిన మొత్తంలో నుంచి రూ.10,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి పుప్పాల ఆంజనేయులు గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదే సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతినిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు అధికారిక వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు.
ఫిర్యాదుదారులు మరియు బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

