Site icon MANATELANGANAA

అధిక వడ్డీ ఆశచూపి రూ.50 కోట్ల మోసం – నిందితుడి అరెస్టు

interest

నల్గొండ జిల్లా పోలీసులు అధికవడ్డీల ఆశచూపి జనాలను మోసంచేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. అధిక వడ్డీ పేరుతో ప్రజలను నమ్మించి రూ.50 కోట్ల మేర మోసం చేసిన రమావత్ బాలాజీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు విలువైన కార్లు, ఆస్తి పత్రాలు, బాధితుల ప్రామిసరీ నోట్లు, ఏడుగురు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వెల్లడించారు.

పీఏ పల్లి మండలంలోని వద్దిపట్ల గ్రామానికి చెందిన బాలాజీ, 2020లో ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభిస్తానని చెప్పి బంధువుల దగ్గర నుంచి రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ వ్యాపారం విఫలమయ్యాక రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో గ్రామంలోని వారినుంచి రూ.6 వడ్డీకి రూ.15 లక్షలు అప్పుగా తీసుకొని, సమయానికి వడ్డీ చెల్లిస్తూ విశ్వాసం గెలుచుకున్నాడు.

తర్వాత ఏజెంట్లను నియమించుకొని చుట్టుపక్కల గిరిజన తండాల్లో అధిక వడ్డీ పేరుతో డబ్బులు సేకరించడం మొదలుపెట్టాడు. ఈ డబ్బుతో బంధువులు, స్నేహితుల పేర్లపై వ్యవసాయ భూములు, ఇళ్లు, ఖరీదైన కార్లు, బైక్‌లు కొనుగోలు చేసి జల్సాలు చేసేవాడు.

తర్వాత మరింత లాభం కోసం నెలకు రూ.10 వడ్డీ ఇస్తానని జనాలను నమ్మించి కోట్ల రూపాయలు సేకరించాడు. బాధితులకు వడ్డీ ఇచ్చినట్లుగా ప్రామిసరీ నోట్ల వెనుక రాసి ఇచ్చేవాడు. బ్యాంకు వడ్డీ కంటే పది రెట్లు ఎక్కువ రాబడిని చూపడంతో చాలామంది అతడి వలలో చిక్కుకున్నారు.

ఇటీవలి నెలల్లో బాధితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వలేకపోవడంతో వారు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో బాలాజీ పారిపోయాడు. చివరకు నల్గొండ పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ – “అధిక వడ్డీ, త్వరిత లాభాల మాటలు నమ్మి డబ్బులు పెట్టి మోసపోవద్దు” అని సూచించారు.

Share this post
Exit mobile version