సావిత్రి బాయి పూలే చరిత్ర చరిత్రను విద్యార్థులకు బోధించాలి
సావిత్రీబాయి పూలే జయంతి వేడుకల్లో నాయకులు
భారతదేశంలోని మెజార్టీ ప్రజలకు విద్యతో పాటు నైతిక విలువలు, చైతన్యం అందించిన సావిత్రీబాయి పూలే చరిత్రను ఎదుగుతున్న విద్యార్థులకు బోధించాలని ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, సాయిని నరేందర్, పోతుల శ్రీమాన్ లు అన్నారు. సావిత్రీబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కేంద్రం న్యూ లయోలా పాఠశాలలో అమ్రీన్ సైయదా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ మాట్లాడుతూ భారత సమాజానికి సావిత్రీబాయి చేసిన సేవలను గుర్తించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహాతల్లి పుట్టిన రోజును మహిళా ఉపాద్యాయ దినోత్సవంగా ప్రకటించడం గొప్ప విషయమని అన్నారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణన జరపడమే కాకుండా బహుజన సమాజం అభివృద్ధికి కృషి చేసిన మహనీయుల ఆశయాలను అమలు చేయడానికి ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వి.సి.కె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో సగబాగమైన మహిళల అభ్యున్నతికి త్యాగపూరిత ఉద్యమం చేసిన అమ్మ సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని విద్యాలయాల్లో బోధించాలని, ఆనాడు మహిళలపై వివక్ష చూపినట్లుగానే నేటి సమాజంలో అడుగడుగునా మహిళలపై దాడులు జరుగుతున్నాయని, అణగారిన వర్గాల మహిళలను అన్ని రంగాల్లో అణచివేస్తున్నారని, సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తితో మహిళా సాధికారితను, సమానత్వాన్ని సాధించాలని అన్నారు. ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ పూలే దంపతుల కృషి వల్ల ఎదిగిన బహుజన సమాజం మిగతా సమాజం ఎదగడానికి కృషి చేయాలని, ప్రజాస్వామ్యంలో ప్రధాన భూమిక పోషించే చట్టసభల్లో, మహిళా రిజర్వేషన్లలో బి.సి లకు రిజర్వేషన్లు లేకపోవడం దుర్మార్గమని అన్నారు. సావిత్రీబాయి స్ఫూర్తితో చట్టసభల్లో బి.సి రిజర్వేషన్లతో పాటు మహిళా బిల్లులో బి.సి మహిళా కోటాకై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫసర్ కొంగర సాంబలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కవిత మాట్లాడుతూ పూలే దంపతులు చేసిన పోరాటాన్ని లయోలా పాఠశాల విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించారని, చిన్న వయసు నుండే మహనీయుల చరిత్రను, నైతిక విలువలను విద్యా సంస్థల్లో బోధించడం వల్ల అసమానతలు లేని సమాజం నిర్మితం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు తాడిశెట్టి క్రాంతి మాట్లాడుతూ విద్య లేని కాలంలో త్యాగపూరిత ఉద్యమం ద్వారా పూలే దంపతులు అణగారిన వర్గాలకు విద్యానందిస్తే నేడు ప్రైవేట్, కార్పొరేట్ విద్య వల్ల అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్య అందడం లేదని అన్నారు. సావిత్రీబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాద్యాయ దినోత్సవంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న మహిళా ఉపాద్యాయుల భద్రత, వేతనాల గురుంచి ఆలోచన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది ఎగ్గడి సుందర్ రామ్ మాట్లాడుతూ పూలే దంపతులు ఒకరికి ఒకరు సహాకారంతో సమాజానికి ఎంతో సేవ చేశారని, నేటి సామాజిక ఉద్యమకారులు కూడా సావిత్రీబాయి పూలే లాగా ఉద్యమించి న్యాయంగా దక్కాల్సిన వాటాను సాధించాలని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాఠశాల ఉపాధ్యాయులకు, అతిథులుగా వచ్చిన వారికి పాఠశాల ప్రిన్సిపాల్ కర్ర చంద్రశేఖర్ మెమోంటో లు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కొంగర జగన్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box